'పోస్టులు భ‌ర్తీ చేయ‌కుంటే ఈట‌ల రాజీనామా చేయాలి'

3 Sep, 2020 08:58 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట :  టీఆర్ఎస్ ప్ర‌భుత్వం  చేసిన రూ. 3 లక్షల కోట్ల అప్పుల్లో కనీసం రూ.10 వేల కోట్లయినా ప్రజారోగ్యం కోసం ఖర్చు పెట్టారా అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నిం చారు. బుధవారం కాంగ్రెస్‌ పార్టీ బృందం వరంగల్‌ ఎంజీఎం, సూర్యాపేట ఆస్పత్రులను సందర్శించింది. ఈ సందర్భంగా  కరోనా రోగులకు అందిస్తున్న వైద్యసేవలు, వైద్య పోస్టులు ఖాళీ వివరాలు, పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో  అసలు సమస్యను పట్టించుకోకుండా వివిధ విభాగాలపై సమీక్ష చేయడం సిగ్గు చేటన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో అన్ని విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇన్ని పోస్టులు ఖాళీగా ఉంటే ఆరేళ్లుగా గాడిదలను కాస్తున్నారా అని భట్టి నిలదీశారు. (ప్రత్యేక రైళ్లకు అన్‌లాక్‌)

ఈటల తప్పుకోవాలి  
‘ఇంత పెద్ద ఆస్పత్రిలో డాక్టర్లు లేరు.. సదుపాయాలు లేవు. దీని సంగతి పట్టించుకోని నువ్వు ఒక మంత్రివా..? ఎర్రబెల్లివా.. ఎర్రపెల్లివా’అంటూ తీవ్ర స్థాయిలో మంత్రి దయాకర్‌రావుపై ఫైర్ అయ్యారు . 2016లో కేంద్రం పీఎంఎస్‌ఎస్‌వై పథకం కింద నగరంలో రూ.150 కోట్లతో అత్యాధునిక ఆస్పత్రి నిర్మిస్తే రాష్ట్ర వాటా కింద రూ.30 కోట్లు చెల్లించకుండా  ఆస్పత్రిని  నిరుపయోగంగా మార్చిన గొప్ప ప్రభుత్వం ఇది అని మండిపడ్డారు. పెద్దపెద్ద మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి కరోనా విస్తృతి పెరుగుతున్న సమయంలో ఫామ్‌హౌస్‌లో దాక్కున్నారని ఆరోపించారు.  ప్రజల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏ మాత్రం శ్రద్ధ లేదని,  ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేశారని దుయ్యబట్టారు. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పేర్కొన్నారు. పోస్టులను భర్తీ చేయకుంటే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులు అత్యంత దయనీయంగా ఉన్నాయని తెలిపారు. భట్టి వెంట మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. (ఆరోగ్య సలహానా... ట్వీట్‌ చెయ్‌!)

మరిన్ని వార్తలు