ఈ ఊరికి చేరాలంటే.. 8 కి.మీ. నడవాలి

8 Apr, 2022 03:33 IST|Sakshi
భీమనగొంది గ్రామం

బాహ్య ప్రపంచానికి దూరంగా భీమనగొంది గ్రామం

అలంకార ప్రాయంగా ‘భగీరథ’ ట్యాంక్‌

పాడుబడ్డ బావినీరే దిక్కు 

ఎనిమిది కిలోమీటర్ల దూరం కొండలు ఎక్కిదిగితే గానీ ఆ గ్రామానికి చేరుకోలేం. గుక్కెడు నీటికోసం పిల్లాజెల్లా అంతా కలిసి బిందెలు ఎత్తుకుని పాడుబడ్డ బావి దగ్గరికి వెళ్లాల్సిందే. ఊరు విడిచిపోతేగానీ పెద్ద చదువులకు అవకాశం లేదు. అటవీ ప్రాంతంలో కష్టాలతో సహవాసం చేస్తున్న కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా భీమనగొంది గ్రామస్తుల వ్యథ ఇది.

సిర్పూర్‌(యూ): ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ మండలం చోర్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో భీమనగొంది ఉంది. ఇక్కడ 31 ఆదివాసీ కుటుంబాలకు చెందిన 150 మందికిపైగా జీవిస్తున్నారు. ఈ గ్రామానికి చేరుకోవాలంటే చోర్‌పల్లి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం అటవీ ప్రాంతంలో కొండల మధ్య ప్రయాణించాల్సిందే. అదీ ఎగుడు దిగుడుగా ఉండే అధ్వానపు రహదారి మీద స్థానికంగా రేషన్‌ దుకాణం లేకపోవడంతో చోర్‌పల్లికి కాలినడకన వెళ్లి.. 20, 30 కిలోల బియ్యం మూటలు నెత్తిన మోసుకుంటూ తెచ్చుకోవాల్సిందే.

గ్రామస్తులు వినియోగిస్తున్న బావి

ఇక వానాకాలం వచ్చిందంటే మట్టిరోడ్డు బురదతో నిండి.. కాలు తీసి కాలువేయలేని పరిస్థితి ఉంటుంది. ఎంత అత్యవసరమైనా 108 వాహనం రాదు. ఎవరైనా అనారోగ్యం బారినపడితే ఎడ్లబండిపై చోర్‌పల్లి వరకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి ఆటోలు, ప్రైవేట్‌ వాహనాల్లో జైనూర్, సిర్పూర్‌(యూ) మండల కేంద్రాలకు చేరుకుంటారు.

నీళ్లకు నిండా గోస..
గ్రామంలో రెండేళ్ల క్రితం భగీరథ ట్యాంకు నిర్మించారు. కానీ ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వలేదు. ట్యాంకును సైతం 20 రోజులకోసారి నింపుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఊరి చివరన నిర్మించుకున్న బావి నుంచే నీటిని తెచ్చుకుంటున్నారు. బావి ప్రహరీ సగం వరకు కూలిపోయి శిథిలావస్థకు చేరుకుంది.

భీమనగొంది గ్రామ రహదారి

అదికూడా ఈ బావి వాగులో ఉండటంతో వానాకాలంలో చెత్తాచెదారంతో నిండిపోతుంది. గ్రామానికి చెందిన వృద్ధులు వృద్ధాప్య పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు మంజూరు కాలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కనీస సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

పింఛన్‌ వస్తలేదు
నాకు అరవై ఏళ్లు దాటినా ఇప్పటివరకు పింఛన్‌ వస్తలేదు. నాకు ఏ పని చేతకాదు. సర్కారు పింఛన్‌ అందిస్తే బతుకుతా. – ఆత్రం బాగుబాయి, గ్రామస్తురాలు 

రోడ్డు, నీటి సమస్య పరిష్కరించాలి
మా గ్రామానికి రోడ్డు పెద్ద సమ స్య. ఊరి నుంచి పంచాయతీకి వెళ్లాలంటే ఎనిమిది కిలోమీటర్లు నడవాల్సిందే. రోడ్డు, నీటి సమ స్య పరిష్కరిస్తే గ్రామం బాగు పడుతుంది. – మర్సుకోల సోనేరావు, గ్రామస్తుడు

మరిన్ని వార్తలు