భీమ్లా నాయక్ ఎఫెక్ట్‌.. యూసఫ్‌గూడ రూట్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

22 Feb, 2022 20:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాగర్‌ కె చంద్ర డైరెక్షన్‌లో పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి లీడ్‌ రోల్‌లో నటిస్తున్న భీమ్లా నాయక్‌ చిత్రం ఈ నెల 25న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23న(బుధవారం) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది చిత్ర యూనిట్‌. ఇందుకోసం యూసఫ్ గూడ పోలిస్ గ్రౌండ్స్ వేదిక కానుంది. సాయంత్రం జరగబోయే ఈ ఈవెంట్‌ నేపథ్యంలో ఆ రూట్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించింది నగర పోలీస్‌ శాఖ.

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ సందర్భంగా రేపు మధ్యాహ్నం 2గం నుంచి రాత్రి 11గం వరకూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో మైత్రీవనం నుంచి యూసఫ్ గూడ చెక్‌పోస్ట్‌ వైపు వాహనాలకు అనుమతి నిరాకరిస్తారు. సవేరా ఫంక్షన్ హాల్, క్రిష్ణ కాంత్ పార్క్, కళ్యాణ్ నగర్, సత్యసాయి నిగమాగమం, కృష్టానగర్ మీదుగా వాహనాల మళ్లింపు ఉంటుంది. 

అలాగే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి యూసఫ్ గూడా వైపు వచ్చే వాహనాలు శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమగమం వైపు మళ్లిస్తారు. సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్, యూసఫ్ గూడా మెట్రో స్టేషన్ , కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం, ప్రభుత్వ పాఠశాలల్ని పార్కింగ్‌ ప్రదేశాలుగా గుర్తించారు. వాహనదారులు ఈ రూట్‌లలో ప్రయాణించి.. అసౌకర్యానికి గురికాకూడదని హైదరాబాద్‌ ‍ట్రాఫిక్‌ పోలీసులు ట్వీట్లు చేశారు.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. 21వ తేదీనే ఈ ఈవెంట్‌ జరగాల్సిన ఉండగా.. ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో ఈవెంట్‌ను వాయిదా వేశారు. దీంతో 21వ తేదీతో ఇచ్చిన పాసులకు అనుమతి ఉండదని, కేవలం 23వ తేదీతో ఉన్న పాసులకు మాత్రమే అనుమతి ఉంటుందని నగర పోలీస్‌ కమిషనర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు