బోయిగూడ అగ్ని ప్రమాదం: ‘అది పేలడం వల్లే మంటలు వ్యాపించాయి’

26 Mar, 2022 07:53 IST|Sakshi

న్యూ బోయగూడ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణం

మంటలు ఆర్పే పరికరం పేలడంతోనే విస్తరించిన మంటలు

కీలక ఆధారాలు సేకరించిన హైదరాబాద్‌ క్లూస్‌ టీమ్‌

ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన గాంధీనగర్‌ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: కార్యాలయాలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే మంటలు ఆర్పడానికి ఫైర్‌ ఎగ్ట్సింగ్విషర్స్‌ (మంటలు ఆర్పే పరికరం) వాడుతుంటారు. అయితే న్యూ బోయగూడలోని స్క్రాప్‌ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్రత పెరగడానికి ఇలాంటి ఫైర్‌ ఎగ్ట్సింగ్విషరే కారణమైందని పోలీసులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌ క్లూస్‌ టీమ్‌తో పాటు గాంధీనగర్‌ పోలీసులు ఘటనాస్థలి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే క్లూస్‌ అధికారులు కీలక ఆధారాలను సేకరించిన పోలీసులకు అందించారు. వీటి ఆధారంగానే షార్ట్‌సర్క్యూట్‌ ద్వారా అగ్గి పుట్టి ఉండొచ్చని, ఫైర్‌ ఎగ్ట్సింగ్విషర్‌ కారణంగా విస్తరించిందని తేల్చారు. ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.  
సంబంధిత వార్త: బోయిగూడ అగ్ని ప్రమాదం: గోదాంలో ఉండేది 8 మందే.. ఆ నలుగురు ఎవరంటే!

మంటలు మొదలైంది స్టెయిర్‌ కేస్‌ వద్దే... 
ఈ స్క్రాప్‌ గోదాం నుంచి బిహారీలు బస చేసిన మెజనైన్‌ ఫ్లోర్‌కు వెళ్లడానికి స్పెరల్‌ స్టెయిర్‌ కేస్‌ ఉంది. దీని పక్కనే ఓ స్విచ్‌బోర్డ్‌ ఉండగా, మంగళవారం రాత్రి దీని ఎదురుగా ట్రాలీ ఆటో ఆగింది. స్విచ్‌బోర్డ్‌ చుట్టూ వైర్లు ఉండటంతో పాటు అందులోని ఓ ఫ్యూజ్‌ కొట్టేసి ఉన్న అధికారులు గుర్తించారు. మిగిలిన ఫ్యూజుల్లో ఒక వైరు కాకుండా కొన్ని వైర్లను కలిపి సర్క్యూట్‌ ఏర్పాటు చేసినట్లు తేల్చారు. దీని ప్రకారం ఆ గోదాంలో తరచు ఫ్యూజ్‌ కొట్టేస్తూ ఉంటుందని నిర్ధారించారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే మంటలు అంటుకోవడంతో పాటు ఓ ఫ్యూజ్‌ కొట్టేసిందని భావిస్తున్నారు. అక్కడే పార్క్‌ చేసి ఉన్న ఆటోను పరిశీలించిన అధికారులు స్టెయిర్‌ కేస్‌ వైపు ఎక్కువగా, రెండో వైపు తక్కువగా కాలినట్లు తేల్చారు. దీని ఆధారంగానూ ఆస్టెయిర్‌ కేస్‌ వద్దే అగ్గిపుట్టినట్లు నిర్ధారిస్తున్నారు. 

బయటి వేడి ఎక్కువ కావడంతోనే...   
ఈ మంటలు సమీపంలోని స్క్రాప్‌కు అంటుకోవడంతో కాస్త విస్తరించాయి. ఆ సమీపంలోనే ఉన్న  ఫైర్‌ ఎగ్ట్సింగ్విషర్‌ చుట్టూ మంటలు చేరేసరికి దాని ఉపరితల భాగం బాగా వేడెక్కింది. దీని ప్రభావంతో లోపల ఉండే వివిధ పౌడర్లు వ్యాకోచించడం, వాయువులుగా మారడం ప్రారంభమైంది. దీంతో పైన ఉన్న ఇనుప  సిలిండర్‌ను పగులకొట్టకుంటూ ఆ వాయువులు బయటకు చొచ్చుకురావడంతో పేలుడు సంభవించింది.
చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌ తొలి గెజిట్‌కు గ్రీన్‌సిగ్నల్‌.. 113 గ్రామాలు.. 1904 హెక్టార్లు

దీని శబ్ధానికే ‘మృత్యుంజయుడు’ ప్రేమ్‌ లేచి సురక్షితంగా బయటపడ్డాడు. సాధారణంగా  ఫైర్‌ ఎగ్ట్సింగ్విషర్‌ లోపల నుంచి కార్బన్‌డయాక్సైడ్‌ రావాలి. అయితే మంటల వేడి కారణంగా అందులోని పౌడర్లు వివిధ మార్పులు చెంది బయటకు చొచ్చుకువచ్చాయి. దీంతో అవి సమీపంలో ఉన్న మంటను గోదాం మొత్తం విస్తరించేలా చేశాయి. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన పేలుడు ఫైర్‌ ఎగ్ట్సింగ్విషర్‌కు సంబంధించిందని అధికారులు గుర్తించారు.  

వివిధ రకాలైన ఆధారాల సేకరణ... 
ఘటనాస్థలిలో అణువణువూ పరిశీలించిన పోలీసులు, ఫోరెన్సిక్‌ నిపుణులు, క్లూస్‌ టీమ్‌ అధికారులు అనేక ఆధారాలను సేకరించారు. 

డీఆర్‌డీఓ ఆస్పత్రికి ప్రేమ్‌ తరలింపు 
గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్‌ న్యూబోయిగూడ అగ్నిప్రమాదంలో గాయపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు ప్రేమ్‌ను కాంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఓ అపోలో ఆస్పత్రికి శుక్రవారం తరలించారు. బోయిగూడ ప్రమాదంలో 11 మంది సజీవ దహనం కాగా ప్రేమ్‌ ఒక్కడే ప్రాణాలతో బయటపడిన సంగతి విదితమే. 20 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న ప్రేమ్‌ను గాంధీ పాస్టిక్‌సర్జరీ విభాగ హెచ్‌ఓడీ ప్రొఫెసర్‌ సుబోధ్‌ కుమార్‌ నేతృత్వంలో  వైద్యసేవలు అందించారు. వేడి పొగ పీల్చడంతో ఊపరితిత్తుల లోపలి భాగాలు ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్లు భావించిన వైద్యులు పలుమార్లు ఎక్స్‌రేలు తీశారు. మరింత మెరుగైన వైద్యం అందించాలని భావించి డీఆర్‌డీఓ అపోలో ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు