వాగ్దానాన్ని నిలబెట్టుకోండి 

14 Aug, 2020 02:22 IST|Sakshi
రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ నమూనాను చూస్తున్న మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, తదితరులు  

కాజీపేటలో రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి 

కేంద్రానికి కేటీఆర్‌ విజ్ఞప్తి 

రంగారెడ్డి జిల్లా కొండకల్‌లో మేధా రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీకి భూమి పూజ 

తెలంగాణ స్వయం సమృద్ధి రాష్ట్రంగా అవతరించాలని ఆకాంక్ష

సాక్షి, రంగారెడ్డి జిల్లా:/సంగారెడ్డి/పటాన్‌చెరు: వరంగల్‌లోని కాజీపేటలో రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామన్న వాగ్దానాన్ని కేంద్ర ప్రభుత్వం నిలుపుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం కాజీపేటలో రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామన్న హామీ ఇచ్చి ఆరేళ్లు గడుస్తున్నా.. ఇంత వరకు అతీగతీ లేదన్నారు. రాజకీయం చేయడం కోసం కాదని.. బాధతో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నట్లు చెప్పారు.

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్‌లో సుమారు 106 ఎకరాల విస్తీర్ణంలో రూ.వెయ్యి కోట్ల వ్యయంతో మేధా సర్వో డ్రైవ్స్‌ సంస్థ స్థాపిస్తున్న మేధా రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీకి మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డితో కలసి గురువారం ఆయన భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మేధా సంస్థ ద్వారానే తెలంగాణకు రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ వచ్చిందన్నారు. ప్రైవేటు సెక్టార్‌లో మేధా సంస్థ.. భారతదేశపు అతిపెద్ద రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీగా అవతరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 1984లో స్థాపించిన ఈ సంస్థ.. ప్రస్తుతం రూ.21 వేల కోట్ల వార్షిక టర్నోవర్‌కు చేరుకుందని వివరించారు.

తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. ఆదిబట్ల కేంద్రంగా విమానాలు, హెలికాప్టర్లు, వాటి విడి భాగాలు, జహీరాబాద్‌లో ట్రాక్టర్లు, బస్సులు తయారవుతున్నాయని తెలిపారు. తాజాగా రైల్‌కోచ్‌ తయారీ లోటూ తీరిందన్నారు.హ్యుందాయ్‌ రోటెమ్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు పోటీ పడుతున్న ఈ రంగంలో తెలంగాణకు చెందిన మేధా సంస్థ ఉండటం ఈ ప్రాంత బిడ్డగా ఎంతో గర్వపడుతున్నానని కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మెట్రో విస్తరణ, వరంగల్‌ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో మోనో రైళ్ల ఏర్పాటుకు అవసరమైన కోచ్‌ లను మేధా సంస్థ అందించాలని కోరారు. 18 నెలల్లో ఈ సంస్థ మొదటి యూనిట్‌ ద్వారా కోచ్‌లను ఉత్పత్తి చేస్తుందన్నారు.  

హై స్పీడ్‌ రైళ్ల రాక అవసరం 
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తున్న సమయంలో ఈ ప్రాంతానికి పెట్టుబడులు రావనే అపోహలు, అనుమానాల నుంచి.. ప్రస్తుతం పారిశ్రామిక రంగంలో గర్వంగా చెప్పుకునే స్థాయికి రాష్ట్రం ఎదిగిందని కేటీ ఆర్‌ చెప్పారు. తెలంగాణ స్వయం సమృద్ధి సాధించిన రాష్ట్రంగా అవతరించాలని ఆయన ఆకాక్షించారు. హై స్పీడ్‌ రైళ్లను తీసుకురావాల్సి ఉందని, వాటితో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. గంట కు 160 కి.మీ. వేగంతో ప్రయాణించే రైళ్లతో హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు గంటలో, ఆదిలాబాద్‌కు గంటంబావులో చేరుకోవచ్చని అన్నారు. తద్వారా హైదరాబాద్‌లో పనిచేసే వ్యక్తి.. ఇక్కడే జీవించాల్సిన పనిలేకుండా ఇతర జిల్లాల నుంచి ట్రైన్ల ద్వారా రాకపోకలు సాగించవచ్చన్నారు. హై స్పీడు రైల్వే నెట్‌వర్క్‌ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని ఆయన కోరారు. 

స్థానికులకే 70 శాతం ఉపాధి  
కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీల్లో 70 శాతం వరకు స్థానికులకే ఉపాధి అవకాశాలు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం పాలసీని తీసుకొచ్చిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ స్థాయిలో ఉపాధి కల్పిస్తే.. పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే వాయు కాలుష్యాన్ని తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ పాలసీని తీసుకొస్తున్నట్లు కేటీఆర్‌ చెప్పారు. ద్విచక్ర పాలసీని అధ్యయనం చేసి ఆ దిశగా కూడా ప్రయత్నించాలని మేధా సంస్థను కోరారు. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిల్లో కొండకల్, వెలిమలలో ఏర్పాటవుతున్న రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ.. ఈ రెండు గ్రామాలను దత్తత తీసుకోవాలన్నారు.

అలాగే ఆయా పరిశ్రమల్లో ఉపాధి కల్పన కోసం ఎంపీ నిధులతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీలు రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌ రెడ్డిని కేటీఆర్‌ కోరారు. మేధా రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ ఏడాదికి 500 కోచ్‌లు, 50 లోకోమోటివ్స్‌ చొప్పున తయారు చేస్తుందని ఆ సంస్థ ఎండీ యడవెల్లి కశ్యప్‌రెడ్డి తెలిపారు. ప్రత్యక్షంగా వెయ్యి, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మేధా సంస్థ ఈడీ శ్రీనివాస్‌ రెడ్డి, ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి, టీఎస్‌ఐఐసీ అధ్యక్షుడు బాలమల్లు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు