హరితహారం మొక్కలు తిన్న మేకలకు రూ.5వేలు జరిమానా

11 Jan, 2022 21:18 IST|Sakshi
మేకల మెడలో వేసిన జరిమానా రసీదు

సాక్షి, భూదాన్‌ పోచంపల్లి : హరితహారంలో నాటిన మొక్కలు తిన్నందుకు మేకలకు రూ.5వేలు జరిమానా విధించిన సంఘటన సోమవారం నల్గొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురంలో చోటుచేసుకుంది. పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హరితహారంలో భాగంగా గ్రామపరిధిలో రోడ్డు వెంట, అలాగే పల్లెప్రకృతి వనాల్లో మొక్కలు నాటారు. అయితే పలువురి మేకలు తరుచూ మొక్కలను తింటుండటంతో గతేడాది సెప్టెంబర్‌లో గ్రామసభ నిర్వహించి పశువులు, మేకలు మొక్కలు తిన్నా, లేదా ఏదేని కారణంతో తొలగించినా మొక్కకు రూ.500 చొప్పున జరిమానా విధించాలని తీర్మానించారు.

కాగా.. సోమవారం గ్రామానికి చెందిన శాపాక జంగమ్మకు చెందిన మేకలు రోడ్డు వెంట నాటిన మొక్కలతో పాటు, పల్లెప్రకృతి వనంలోనివి కలిపి మొత్తం 10 మొక్కలు తిన్నాయి. దాంతో సిబ్బంది వాటిని పట్టుకొని గ్రామపంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చి బంధించారు. 10 మొక్కలకు గాను రూ. 5000వేల జరిమానా విధించి రసీదును మేకల మెడలో వేశారు. జరిమానా చెల్లించి మేకలు తీసుకెళ్లాలని అధికారులు సదరు యజమానికి సమాచారం ఇచ్చారు. అంతేకాక గతంలో అనేక మార్లు హెచ్చరించినా తీరు మారకపోవడంతో కేసు కూడా నమోదు చేయాలని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
చదవండి: ఆ దేశంలో యూనిట్‌ కరెంటు 14 పైసలే.. ఎక్కడో తెలుసా?
చదవండి: ‘పిల్లలను చూసైనా బతకాలనిపించలేదా?’ 

మరిన్ని వార్తలు