రూ.10కే అత్యాధునిక వైద్యం 

5 Nov, 2020 03:42 IST|Sakshi

నేటి నుంచి ఎయిమ్స్‌లో ఓపీ సేవలు

40 పడకలతో ఇన్‌పేషెంట్‌ సేవలు 

 2024 నాటికి పూర్తిస్థాయి వైద్యం 

‘సాక్షి’తో బీబీనగర్‌ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా 

సాక్షి, యాదాద్రి: బీబీనగర్‌ ఎయిమ్స్‌లో గురువారం నుంచి ఓపీ సేవలు ప్రారంభమవుతాయని, రూ.10కే అత్యాధునిక వైద్యం అందజేస్తామని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా తెలిపారు. దేశంలోని టాప్‌–10 ఎయిమ్స్‌లలో ఒకటిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. బుధవారం ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడుతూ.. 2024 నాటికి అత్యాధునిక సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ప్రజలకు ఇక్కడ వైద్యం అందనుందని పేర్కొన్నారు. పూర్తి స్థాయి ఎయిమ్స్‌ కోసం సుమారు రూ.1,000 కోట్ల నిధులు కేంద్రం మంజూరు చేసిందన్నారు. జనరల్‌ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఆప్తమాలజీ, గైనిక్, ఫ్యామిలీ మెడిసిన్, పీడియాట్రిక్‌ సేవలు అందించనున్నట్లు వివరించారు. ఇందుకోసం డాక్టర్ల నియామకం, వైద్య పరికరాల కొనుగోలు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తయిందని చెప్పారు. డిసెంబర్‌ చివరి వారంలో 100 పడకల ఇన్‌పేషెంట్‌ విభాగాన్ని ప్రారంభించాల్సి ఉండగా, కోవిడ్‌ నేపథ్యంలో 40 పడకలకే పరిమితం చేస్తున్నామని, ఇందులో పాజిటివ్‌ కేసుల కోసం 10 పడకలతో ఐసీయూ ఏర్పాటు చేస్తామన్నారు.  

మెరుగైన సేవల కోసం రాజీపడం  
మెరుగైన సేవల కోసం ఎక్కడా రాజీపడేది లేదని వికాస్‌ భాటియా స్పష్టం చేశారు. తెలంగాణ ఎయిమ్స్‌లో పనిచేయడానికి దేశంలోని ప్రముఖ డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది పెద్దఎత్తున పోటీ పడుతున్నారని తెలిపారు. 483 మంది ప్రొఫెసర్ల ఉద్యోగాల కోసం 2 వేల మంది దరఖాస్తు చేసుకోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 22 మంది డాక్టర్ల నియామకం పూర్తయిందని, మరికొంత మంది డాక్టర్ల నియామకం త్వరలో పూర్తవుతుందని ఆయన వివరించారు.  2024 నాటికి 750 పడకలతో పూర్తి స్థాయి సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి తెస్తామన్నారు.  

మాస్టర్‌ప్లాన్‌ అప్రూవ్‌ అయ్యింది  
ఎయిమ్స్‌ ప్రధాన భవన సముదాయం నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌ అప్రూవల్‌ అయ్యిందని భాటియా తెలిపారు. 201 ఎకరాల్లో విశాలమైన పార్కులు, క్రీడా మైదానాలు, ఆస్పత్రి భవనాలు, విద్యార్థుల వసతి గృహాల 28 అంతస్తుల 3 టవర్‌లు బాలురు, బాలికలు, స్టాఫ్‌ కోసం వేర్వేరుగా నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. స్విమ్మింగ్‌ పూల్స్, గార్డెనింగ్, గెస్ట్‌హౌజ్, మెడికల్‌ కళాశాల, ఆయుష్‌ బిల్డింగ్, ఆడిటోరియం వెనక స్టాఫ్‌ రెసిడెన్షియల్‌ భవనాలు, పార్కులు ఇలా ఆహ్లాదకర వాతావరణం ఉంటుందన్నారు. నిమ్స్‌ భవన సముదాయాలు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు అధికారికంగా అప్పగించలేదన్నారు. ఎయిమ్స్‌కు అనుబంధంగా 40 నుంచి 60 కిలో మీటర్ల లోపు రూరల్‌ హెల్త్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా