కమలంలో ‘సాగర్‌’ లొల్లి.. ఎందుకంటే!

31 Mar, 2021 01:54 IST|Sakshi

రవినాయక్‌ అభ్యర్థిత్వంపై స్థానిక బీజేపీ నేతల్లో అసంతృప్తి

కొత్త వారికి ఎలా చాన్స్‌ ఇస్తారంటూ ఆగ్రహం

ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరిన కడారి అంజయ్య

 పార్టీ పెద్దలకు దూరంగా జిల్లా బీజేపీ అధ్యక్ష దంపతులు

 ‘గులాబీ’ నుంచి అందిన ఆహ్వానం? 

హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ ఉపఎన్నికకు పార్టీ అభ్యర్థిగా డాక్టర్‌ రవికుమార్‌ నాయక్‌ ఎంపిక కమలదళంలో అసంతృప్తికి దారితీసింది. అభ్యర్థి రేసులో ఉన్నప్పటికీ పార్టీ నాయకత్వం తమను పట్టించుకోకపోవడం జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి.. సతీమణి నివేదిత (గత ఎన్నికల్లో పోటీ చేశారు)తోపాటు పార్టీని నమ్ముకొని పనిచేసిన కడారి అంజయ్య యాదవ్‌కు ఆగ్రహం తెప్పించింది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వ్యక్తిని అభ్యర్థిగా ఎంపిక చేయడంపట్ల మరికొందరు నేతలూ అసహనం వ్యక్తం చేస్తున్నారనే చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. రవిని అభ్యర్థిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ అంజయ్య మంగళవారమే టీఆర్‌ఎస్‌లో చేరగా కంకణాల దంపతులు మౌనంగా ఉన్నా పార్టీ పెద్దలకు దూరంగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది.

తెల్లారేసరికి టీఆర్‌ఎస్‌లోకి..
రవినాయక్‌ అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్టానం సోమవారం రాత్రి ఖరారు చేయగా తెల్లారేసరికే నియోజకవర్గంలో పార్టీ రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఇక్కడి నుంచి టికెట్‌ ఆశించిన కంకణాల శ్రీధర్‌రెడ్డి దంపతులు అటు పార్టీ కేడర్‌కు, ఇటు పార్టీ పెద్దలకు అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక అంజయ్య యాదవ్‌ అయితే ఏకంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను వెంట బెట్టుకుని ఎర్రవెల్లిలోని సీఎం ఫాంహౌస్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. తనకు బీజేపీ టికెట్‌ ఇవ్వకపోతే యాదవ సామాజికవర్గానికి చెందిన భగత్‌కు మద్దతిస్తానని అంజయ్య గతంలోనే చెప్పినట్లు తెలుస్తోంది. తనకు ఎలాగూ టికెట్‌ ఇవ్వకపోవడంతో ఇప్పుడు అధికారికంగా ఆయన టీఆర్‌ఎస్‌లో చేరి కార్పొరేషన్‌ చైర్మన్‌ హామీ దక్కించుకున్నారనే చర్చ కమలదళంలో జరుగుతోంది. అంజయ్యకు టికెట్‌ ఇస్తే యాదవ సామాజికవర్గానికి చెందిన ఓట్లు అదనంగా వచ్చేవని, పార్టీ మంచి జోష్‌లో ఉన్న నేపథ్యంలో ఆ ఓట్లు కూడా తోడయితే ఆయన గట్టిపోటీ ఇచ్చేవారని పార్టీలో చర్చ జరుగుతోంది.

పార్టీ పెద్దలతో మాట్లాడేందుకు నిరాకరణ...
కంకణాల శ్రీధర్‌రెడ్డి దంపతులకు సైతం టీఆర్‌ఎస్‌ గాలం వేసినట్లు సమాచారం. గులాబీ దళంలోకి రావాలని శ్రీధర్‌రెడ్డి, నివేదితలకు ఆహ్వానం అందిందని, అయితే వారు సున్నితంగా తిరస్కరించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తాము మొదటి నుంచీ సంఘ్‌ కార్యకర్తలుగా బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని, టికెట్‌ ఇవ్వనందున అలక సాధారణమేనని, పార్టీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని వారు సన్నిహితులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఉపఎన్నికలో రవికుమార్‌ పోటీలో ఉన్నా రెండున్నరేళ్ల తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో తమకు పార్టీ అవకాశం ఇస్తుందనే భరోసా కూడా వారు వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే కంకణాల దంపతులతో మాట్లాడేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నించినా వారు అందుబాటులోకి రాకపోవడంతో కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డికి మద్దతు ప్రకటిస్తారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. ఈ ఊహాగానాలను కూడా బీజేపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.  

మరిన్ని వార్తలు