టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీలో బిగ్‌ ట్విస్ట్‌.. ప్రధాన సూత్రధారి రాజశేఖర్‌

17 Mar, 2023 17:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీక్‌ కేసులో సిట్‌ పెద్ద ట్విస్ట్‌ ఇచ్చింది. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ అయినప్పటికీ.. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన సూత్రధారి రాజశేఖర్‌ అని తేల్చింది సిట్‌. ఈ మేరకు టీఎస్‌పీఎస్‌సీకి శుక్రవారం తన నివేదికను అందించింది. 

టీఎస్‌పీఎస్‌సీలో సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పని చేసేవాడు రాజశేఖర్‌. అయితే.. గతంలో టెక్నికల్‌ సర్వీస్‌లో పని చేసే రాజశేఖర్‌.. ఉద్దేశపూర్వకంగానే డిప్యూటేషన్‌పై వచ్చాడు. అక్కడ కం‍ప్యూటర్‌ను హ్యాక్‌ చేసి పాస్‌వర్డ్‌ను దొంగిలించినట్లు సిట్‌ అనుమానిస్తోంది. ఇక విధుల్లో చేరాక..  ప్రవీణ్‌తో సంబంధాలు నడిపాడు రాజశేఖర్‌. దాదాపు ఐదు పరీక్షా పత్రాలను పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసి ప్రవీణ్‌కు ఇచ్చాడు. 

ఫిబ్రవరి 27నే పేపర్‌ను కాపీ చేశాడు రాజశేఖర్. అదే తేదీన రాజశేఖర్‌కు అందించాడు. ఇందులో గ్రూప్‌-1 పరీక్షాపత్రంతో పాటు జూలైలో జరగాల్సిన జూనియర్‌ లెక్చర్‌ పరీక్ష ప్రశ్నాపత్రం సైతం ఉందని సిట్‌ దర్యాప్తులో తేలింది(అందుకే పరీక్షలు వాయిదా వేసింది కమిషన్‌).  ఆపై ప్రవీణ్‌.. రేణుకను పేపర్‌లను అమ్మేశాడు. అదే సమయంలో ప్రవీణ్‌కు 103 మార్కులు రావడంపై సిట్ విచారణ జరుపుతోంది. సెక్రటరీ దగ్గర పీఏగా చేస్తూ గ్రూప్‌-1 పరీక్షా పత్రాన్ని కొట్టేసినట్లు నిర్ధారించుకుంది సిట్‌.

మరోవైపు పాస్‌వర్డ్‌ ఎలా బయటకు వచ్చిందనే విషయంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ప్రవీణ్‌ పాస్‌వర్డ్‌ను  శంకర్‌ లక్ష్మి అనే ఉద్యోగి డైరీ నుంచి కొట్టేశానని చెబుతున్నాడు. అయితే ఆమె మాత్రం పాస్‌వర్డ్‌ను తాను డైరీలో రాయలేదని చెబుతోంది. ఈ తరుణంలో.. శంకర్‌ లక్ష్మీ పాత్రపైనా దర్యాప్తు కొనసాగిస్తోంది సిట్‌. ఈ కేసులో తొమ్మిది మంది నిందితులకు ఆరు రోజుల కస్టడీ విధించింది కోర్టు. దీంతో.. రేపటి నుంచి సిట్‌ వీళ్లను ప్రశ్నించనుంది.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు