25 వారాలు.. 25 ఏళ్లు వెనక్కు

16 Sep, 2020 05:46 IST|Sakshi

కరోనా ప్రపంచాన్ని తిరోగమనంలోకి నెట్టింది 

బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ నివేదిక 

ప్రపంచవ్యాప్తంగా 7 శాతం పెరిగిన తీవ్ర పేదరికం 

వ్యాక్సినేషన్‌ పరిస్థితి 1990ల నాటికి దిగజారింది 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచం గత 25 వారాల్లో 25 ఏళ్లు వెనక్కు వెళ్లిందని ద బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ వెల్లడించింది. నాలుగో గోల్‌ కీపర్స్‌ వార్షిక నివేదికలో ఈ మేరకు పేర్కొంది. కరోనా ప్రపంచాన్ని అన్ని రంగాల్లో తిరోగమనంలోకి నెట్టేసిందని, దీని ప్రభావం ఖండాలు, ప్రాంతాలు, దేశాలకు అతీతంగా ప్రతి ఒక్కరిపై స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించింది. గేట్స్‌ ఫౌండేషన్‌ నివేదిక పేర్కొన్న ప్రధానాంశాలివి... 

► కోవిడ్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కడు పేదరికం 7 శాతం పెరిగింది.  
► ప్రపంచంలోని అన్ని దేశాల ఆరోగ్య పరిస్థితి మారిపోయింది. ఎంతగా అంటే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అధమంగా 1990ల నాటి స్థితికి చేరింది.  
► కరోనా కారణంగా నష్టపోయిన ఆర్థిక వ్యవస్థల పునరుత్తేజానికి ఉద్దీపన ప్యాకేజీల కింద అన్ని దేశాలు కలిపి 18 ట్రిలియన్‌ డాలర్ల వరకు ప్రకటించాయి. అయినా 2021 చివరి నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం 12 ట్రిలియన్‌ డాలర్ల మేర నష్టపోనుంది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత అతిపెద్ద జీడీపీ నష్టమిదే. 
► మహిళలు, మైనారిటీ వర్గాలు, తీవ్ర పేదరికంలో నివసిస్తున్న ప్రజలపై ఈ మహమ్మారి అసమాన ప్రభావాన్ని చూపింది. 
► అమెరికా లాంటి సంపన్న దేశంలో తెల్ల జాతీయులతో పోలిస్తే నల్ల జాతీయులు, లాటిన్‌ ప్రజలు తమ ఇళ్లకు అద్దె చెల్లించేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు.  
► ఇక, వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత పరిస్థితిని అంచనా వేస్తే వ్యాక్సిన్‌ కొనుగోలు విషయంలో ప్రపంచ దేశాలు పోటీ పడతాయి. నార్త్‌ ఈస్టర్న్‌ వర్సిటీ పరిశీలన ప్రకారం... ఈ పోటీలో ధనిక దేశాలు మొదటి 200 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ కొనుగోలు చేస్తే... పేద దేశాలకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాక కోవిడ్‌ మరణాల సంఖ్య రెట్టింపు అవుతుంది. 
► ఈ సవాలును ఏ ఒక్క దేశం కూడా ఒంటరిగా ఎదుర్కోలేదు. ఇతరులను నిర్లక్ష్యం చేస్తూ ఒక దేశం తనను తాను రక్షించుకునే ప్రయత్నాలు చేస్తే ఈ మహమ్మారి వల్ల కలిగే కష్టాలు మరింతగా పెరుగుతాయి. వ్యాక్సిన్లను సమానంగా పంపిణీ చేయకపోతే వాటి అభివృద్ధికి ఆటంకం కలిగి ఈ మహమ్మారి త్వరగా అంతం కాదు. 
► ఆర్థిక నష్టం కారణంగా పెరిగిన అసమానతలను ఎదుర్కొనేందుకు వినూత్న పరిష్కారాలను అన్వేషించాలి. 

మరిన్ని వార్తలు