బయో ఆసియా సదస్సుకు బిల్‌గేట్స్‌

19 Feb, 2022 04:03 IST|Sakshi

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్, మెడ్‌ ట్రానిక్స్‌ సీఈవో కూడా.. 

24, 25 తేదీల్లో వర్చువల్‌గా సదస్సు 

ఇష్టాగోష్టికి మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 24న ప్రారంభం కానున్న రెండ్రోజుల బయోటెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌ వార్షిక సదస్సు ‘బయో ఆసియా’లో బిల్‌ మెలిండా గేట్స్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అలెక్స్‌ గోర్సీ్క, మెడ్‌ ట్రానిక్స్‌ సీఈవో జెఫ్‌ మార్తా పాల్గొననున్నారు. 24, 25 తేదీల్లో వర్చువల్‌ విధానంలో ఈ సదస్సు జరగనుంది. బిల్‌ గేట్స్, అలెక్స్‌ గోర్సీ్క, జెఫ్‌మార్తా.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ నడుమ సాగే ఇష్టాగోష్టిలో కోవిడ్‌ మహమ్మారి వల్ల రెండేళ్లుగా నేర్చుకున్న పాఠాలు, ఆధునిక ఆరోగ్య రక్షణ విధానాలు, విశ్వవ్యాప్తంగా ఆరోగ్య రక్షణ రంగం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు.

మహమ్మారులను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాలు, అందిపుచ్చుకోవాల్సిన సామర్థ్యాలు, ప్రభుత్వం, పరిశ్రమలు పోషించాల్సిన పాత్రపై మాట్లాడతారు. కోవిడ్‌ ప్రభావం, సప్లై చైన్‌లో అంతరాయం, ఆవిష్కరణల వాతావరణం, స్టార్టప్‌లు, ఆరోగ్య రక్షణ రంగంలో ఏఐ, ఎమ్‌ఎల్, డీప్‌ లెర్నింగ్‌ వంటి ఆధునిక సాంకేతికత పాత్రపై జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సీఈవో అలెక్స్‌ గోర్సీ్క కీలక ప్రసంగం చేయనున్నారు. మెడ్‌ టెక్‌ రంగంలో వస్తున్న కొత్త మార్పులు, మెడ్‌ టెక్‌ రంగం అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా అనుసరించాల్సిన విధానాలపై మెడ్‌ ట్రానిక్స్‌ సీఈఓ జెఫ్‌మార్తా ప్రసంగిస్తారు.  

72 దేశాల నుంచి 31 వేల మంది.. 
‘ఆరోగ్య రక్షణ రంగంపై దృష్టిని కేంద్రీకరిస్తూ ప్రతీసారి జరిగే బయో ఏషియా సదస్సు సంబం ధిత రంగాలకు చెందిన వారిని ఒకే గొడుగు కిందకు తీసుకొస్తోంది. 2022 సదస్సు కూడా ఈ పరంపరను కొనసాగిస్తోంది. బిల్‌గేట్స్, గోర్సీ్క, మార్తా వంటి దూరదృష్టి కలిగిన వారు సదస్సులో పాల్గొనడం లైఫ్‌ సైన్సెస్‌ పరిశ్రమకు మేలు చేస్తుంది ’ మంత్రి కేటీ రామారావు ఒక ప్రకటనలో వెల్లడించారు. 72 దేశాలకు చెందిన 31 వేల మంది ప్రతినిధులు వర్చువల్‌ విధానంలో ఈ సదస్సులో పాల్గొంటున్నారని బయో ఏషియా సీఈవో శక్తి నాగప్పన్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ చెప్పారు. ఈ అంతర్జాతీయ వేదిక భారతీయ బయోటెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలు విశ్వవ్యాప్తంగా పేరు సంపాదించేందుకు దోహదం చేస్తుందని అన్నారు.

మరిన్ని వార్తలు