జనరల్‌ బోగీల్లో సీటు గ్యారంటీ

15 Sep, 2021 04:14 IST|Sakshi
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో బయోమెట్రిక్‌ టోకెన్‌ యంత్రాన్ని ప్రారంభిస్తున్న అధికారులు 

ప్రయాణికులకు బయోమెట్రిక్‌ టోకెన్‌ 

ప్రతి ప్రయాణికుడి వివరాలు నమోదు 

క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేదు 

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ప్రారంభం 

సాక్షి, హైదరాబాద్‌: రైళ్లలో సాధారణ బోగీల్లో ప్రయాణం కోసం పడిగాపులు కాస్తున్నారా.. బోగీల వద్ద కిక్కిరిసిన జనం మధ్యలోంచి రైల్లోకి ప్రవేశించలేకపోతున్నారా.. కష్టపడి రైలెక్కినా సీటు లభించక తీవ్ర నిరాశకు గురికావలసి వస్తోందా.. ఇలాంటి సమస్యలకు దక్షిణమధ్య రైల్వే ఒక టోకెన్‌తో పరిష్కారాన్ని అందుబాటులోకి తెచ్చింది. సాధారణ బోగీల్లో ప్రయాణం చేసేవారు టోకెన్‌ తీసుకొంటే చాలు వారికి కేటాయించిన బోగీలో, సీటులో కూర్చొని నిశ్చింతగా ప్రయాణం చేయవచ్చు.

రైలెక్కే సమయంలో టోకెన్‌ నంబర్‌ ప్రకా రం ప్రయాణికులను అనుమతిస్తారు. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే బయోమెట్రిక్‌ టోకెన్‌ వ్యవస్థను సికిం ద్రాబాద్‌ స్టేషన్‌లో మంగళవారం ప్రారంభించింది. దక్షిణమధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ కమిషనర్‌ ఈశ్వరరావు, సికింద్రాబాద్‌ డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ ఎ.కె.గుప్తా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అయి తే, సీట్లు నిండిన తర్వాత వచ్చే ప్రయాణికులకు టికెట్లు ఇవ్వాలా?.. వద్దా?.. అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.  

ప్రయాణం ఇలా... 
అన్‌రిజర్వుడ్‌ కోచ్‌లలో ప్రయాణించే వారు క్యూలైన్లలో నిల్చోవలసిన అవసరం లేకుండా, ప్రయాణికులలో గందరగోళం, తొక్కిసలాట వంటివి చోటుచేసుకోకుండా బయోమెట్రిక్‌ టోకెన్‌ యంత్రాన్ని ఏర్పాటు చేశారు.  
ఈ యంత్రంలో మొదట ప్రతి ప్రయాణికుడి పేరు, రైలు నంబరు, పీఎన్‌ఆర్‌ నంబరు, అతడు/ఆమె వెళ్లవలసిన స్టేషన్, తదితర వివరాలను నమోదు చేస్తారు.  
ప్రయాణికుల బయోమెట్రిక్‌ సమాచారంలో భాగంగా వారి వేలిముద్రలు, ఫొటోగ్రాఫ్‌ తీసుకుంటారు. అనంతరం బయోమెట్రిక్‌ యంత్రం ఆటోమెటిక్‌గా ఒక సీరియల్‌ నంబరుతో టోకెన్‌ను అందజేస్తుంది. 
ఈ టోకెన్‌ నంబర్‌ ప్రకారం ప్రయాణికులు వారికి కేటాయించిన కోచ్‌లలోనే రైలు ఎక్కాలి. 
ప్రయాణికులు టోకెన్‌ తీసుకున్నాక కోచ్‌ వద్దకు ప్రయాణ సమయానికి 15 నిమిషాలు ముందుగానే చేరుకోవచ్చు. 

భద్రతకు భరోసా...
ఈ టోకెన్‌ వ్యవస్థ ద్వారా ప్రయాణికుల భద్రతకు భరోసా లభించనుంది. జనరల్‌ బోగీల్లో ప్రయాణం చేసే ప్రతి ప్రయాణికుడి ఫొటో, వేలిముద్రలు నమోదు కానున్న దృష్ట్యా నేరాల నియంత్రణకు అవకాశం లభించనుంది.  
అత్యంత రద్దీ ఉండే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో బయోమెట్రిక్‌ టోకెన్‌ యంత్రం ఏర్పా టుచేయడం పట్ల సెక్యూరిటీ విభాగం, సికింద్రాబాద్‌ డివిజన్‌ అధికారులు, సిబ్బందిని దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య ప్రత్యేకంగా అభినందించారు. జనరల్‌ కోచ్‌లలో ప్రయాణించే అన్‌రిజర్వ్‌డ్‌ ప్రయాణికులకు ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుందని, ప్లాట్‌ఫారాల వద్ద రద్దీ నివారణకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు