Hyderabad: స్వచ్ఛ సాగర్‌గా హుస్సేన్‌సాగర్‌

12 Feb, 2022 15:40 IST|Sakshi

నాచు పెరగకుండా బయో రెమిడియేషన్‌ 

వేసవిలో దుర్వాసన వెలువడకుండా చర్యలు 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని హుస్సేన్‌సాగర్‌ను స్వచ్ఛ సాగర్‌గా మార్చేందుకు మార్చి నెల నుంచి మహానగరాభివృద్ధి సంస్థ, పీసీబీ సూచనలతో ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించనుంది. ఏటా వేసవిలో ప్రధానంగా నాచు, నైట్రోజన్, పాస్పరస్‌లు భారీగా పెరిగి జలాల నుంచి దుర్గంధం పెద్ద ఎత్తున వెలువడుతుండడంతో స్థానికులు, వాహనదారులు, పర్యాటకులు ఇబ్బందులకు గురవుతున్న  నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రధాన కారణమైన నాచు (ఆల్గే) ఉద్ధృతిని తగ్గించేందుకు జలాల్లో పర్యావరణహిత ఏరోబిక్‌ బ్యాక్టీరియాను ప్రవేశపెట్టడం ద్వారా బయోరెమిడియేషన్‌ ప్రక్రియను నిర్వహించనుంది. ఇందుకోసం ఇటీవలే అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచింది. గతంలో కెనడాకు చెందిన ఓ సంస్థ ఈ ప్రక్రియ చేపట్టడంతో సత్ఫలితాలు సాధించిన నేపథ్యంలో తాజాగా మరోసారి బయో రెమిడియేషన్‌కు సిద్ధమవుతుండడం గమనార్హం.  

మార్చి నుంచి జూన్‌ వరకు..  
వచ్చే నెల నుంచి వర్షాలు కురిసే జూన్‌ వరకు ఈ ప్రక్రియను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధానంగా 4.7 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన హుస్సేన్‌సాగర్‌ క్యాచ్‌మెంట్‌ పరిధి సుమారు 240 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఈ జలాశయంలోకి నాలుగు నాలాల నుంచి నీరు వచ్చి చేరుతోంది.  
ప్రధానంగా కూకట్‌పల్లి నాలాలో ప్రవహించే 400 మిలియన్‌ లీటర్ల రసాయనిక వ్యర్థ జలాలు సాగర్‌కు శాపంగా పరిణమించాయి. ఈ నీరు సాగర్‌లోకి చేరకుండా గతంలో డైవర్షన్‌ మెయిన్‌ ఏర్పాటు చేసినప్పటికీ.. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ బల్క్‌డ్రగ్, ఫార్మా, రసాయనిక పరిశ్రమలకు సంబంధించిన వ్యర్థజలాలు కూకట్‌పల్లి నాలా ద్వారా సింహభాగం సాగర్‌లో చేరుతున్నాయి.  
దీంతో కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్, బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్ల మోతాదు అనూహ్యంగా పెరుగుతోంది. ఈ పరిస్థితి కారణంగా ఏటా వేసవిలో నీరు ఆకుపచ్చగా మారి దుర్గంధం వెలువడుతోంది. బయో రెమిడియేషన్‌తో సాగర జలాల్లో కరిగిన ఆక్సిజన్‌ మోతాదును ప్రతి లీటరుకు 4 మిల్లీ గ్రాములు, బీఓడీని 36 మిల్లీగ్రాముల మోతాదు ఉండేలా చూడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో జలాల్లో వృక్ష, జంతు ఫ్లవకాల మనుగడ సాధ్యపడుతుందని చెబుతున్నారు. 

చదవండి: (ప్రయోగాత్మకంగా డీజిల్‌ బస్సు ఎలక్ట్రిక్‌గా మార్పు! ఇక నుంచి)

అడుగున ఉన్న వ్యర్థాల శుద్ది ఎప్పుడో? 
సుమారు నాలుగు దశాబ్దాల పాటు పారిశ్రామిక వ్యర్థ జలాల చేరికతో సాగర గర్భంలో రసాయనిక వ్యర్థాలు టన్నుల మేర అట్టడుగున పేరుకుపోయాయి. ఈ వ్యర్థాలను ఇజ్రాయెల్,జర్మనీ దేశాల్లో ఉన్న సాంకేతికత ఆధారంగా తొలగించి.. ఈ వ్యర్థాలను మందమైన హెచ్‌డీపీఈ పైపుల్లో నింపి సాగరం చుట్టూ ఆనకట్టలా ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా మిషన్‌ హుస్సేన్‌సాగర్‌కు రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేసినప్పటికీ స్వచ్ఛ సాగర్‌ ఇప్పటికీ సాకారం కాలేదనే ఆరోపణలు వస్తుండటం గమనార్హం.

మరిన్ని వార్తలు