బర్డ్ ఫ్లూ భయం.. 24 గంటల్లోపే 1,500 కోళ్లు మృతి

14 Jan, 2021 09:39 IST|Sakshi

నమూనాలు సేకరించిన అధికారులు

బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు లేవని వెల్లడి

 సాక్షి, డిచ్‌పల్లి (నిజామాబాద్‌‌): నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం యానంపల్లి తండా శివారులోని దుర్గాభవాని పౌల్ట్రీ ఫామ్‌లో 24 గంటల్లోపే 1,500 కోళ్లు మృతి చెందడం కలకలం రేపుతోంది. పౌల్ట్రీ ఫామ్‌ యజమాని తెలిపిన ప్రకారం.. రెండు షెడ్లలో సుమారు 8,000 కోళ్లు పెంచుతున్నారు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా సుమారు వేయి కోళ్లు మృతి చెందాయి. బుధవారం ఉదయాన్నే గమనించిన ఫామ్‌ సిబ్బంది యజమానికి విషయం తెలిపారు. చనిపోయిన కోళ్లను జేసీబీ సాయంతో సమీపంలోని అటవీ ప్రాంతంలో గుంత తవ్వి పూడ్చిపెట్టారు. మధ్యాహ్నం వరకు షెడ్లలో మరో 500 పైగా కోళ్లు కూర్చున్న చోటే కూలబడి చనిపోయాయి. చదవండి: బర్డ్‌ ఫ్లూ: చికెన్‌ అమ్మకాలపై నిషేధం

మండల పశువైద్యాధికారి డాక్టర్‌ గోపికృష్ణకు తెలుపడంతో ఆయన ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ భరత్, ఏడీ (ల్యాబ్‌) కిరణ్‌ దేశ్‌పాండే సాయంత్రం పౌల్ట్రీ ఫామ్‌ను సందర్శించారు. ఫామ్‌ యజమానితో మాట్లాడా రు. చివరి వ్యాక్సినేషన్‌ ఎప్పుడు చేశారు, దాణా ఎవరూ సరఫరా చేస్తారు లాం టి వివరాలు తెలుసుకున్నారు. బతికి ఉన్న కోళ్ల రక్త నమూనాలను, చనిపోయిన కోడిని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించారు. కాగా, ఒక్కరోజే సుమారు 1,500 కోళ్లు మృతి చెందడంతో యానంపల్లి తండవాసులతో పాటు మండలవాసులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లేదు

కేసులు నమోదు కాలేదు
ఇక్కడ చనిపోయిన కోళ్లలో బర్డ్‌ఫ్లూ లక్షణాలు లేవు. ఆర్మూర్, వర్నిలోని పౌల్ట్రీ ఫామ్‌లు సందర్శించాం. ఇప్పటివరకు నిజామాబాద్‌ జిల్లాలో బర్డ్‌ ఫ్లూ కేసులు నమోదు కాలేదు. పరీక్ష  ఫలితాలు రాగానే కోళ్లు ఎలా చనిపోయాయనేది తెలుస్తుంది. జిల్లాలోని పౌల్ట్రీ ఫామ్‌ యజమానులు జాగ్రత్తలు పాటించాలి.     
–డాక్టర్‌ భరత్‌

మరిన్ని వార్తలు