సర్టిఫికెట్ల జారీ.. జీహెచ్‌ఎంసీ రూటే సపరేటు!

23 Mar, 2022 20:21 IST|Sakshi

దేశమంతటా ఒక పోర్టల్‌ విధానం

జీహెచ్‌ఎంసీలో మాత్రం మరొకటి

బర్త్‌ సర్టిఫికెట్లలో అక్రమాలకు ఇదీ ఓ కారణం? 

సాక్షి, హైదరాబాద్‌: ‘ఊరంతా ఓ దారి.. ఉలిపి కట్టెది మరో దారి’ అన్న చందంగా మారింది బల్దియా యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు. దేశవ్యాప్తంగా జనన, మరణాల నమోదు.. సదరు సర్టిఫికెట్ల జారీ ఒకేవిధంగా ఉండేందుకు కేంద్ర రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సస్‌ కమిషన్‌ కార్యాలయం ఓఆర్‌జీఐ అనే ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలు, స్థానిక సంస్థలు బర్త్, డెత్‌లకు సంబంధించిన వివరాల నమోదు, సర్టిఫికెట్ల జారీ, తదితర అంశాలకు ఆ పోర్టల్‌ను వినియోగించాల్సిందిగా సూచించింది. 

జీహెచ్‌ఎంసీలో మాత్రం దాన్ని పట్టించుకోకుండా, సొంత సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయించుకున్నారు. దాని ద్వారా తరచూ ఇబ్బందులు తలెత్తుతుండగా, పరిష్కారం కోసం దాదాపు ఏడాది కాలంగా కసరత్తు చేస్తున్నారు. అయినా ఇబ్బందులు పూర్తిగా తొలగలేదు. లక్షల రూపాయల వ్యయం మాత్రం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం సూచన మేరకు ఓఆర్‌జీఐ సాఫ్ట్‌వేర్‌ను ఎందుకు వినియోగించుకోలేదన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 

► ఇటీవల బోగస్‌ బర్త్‌సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యంలో, అందుకు సొంత వెబ్‌పోర్టల్‌ కూడా ఒక కారణమై ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓఆర్‌జీఐ సాఫ్ట్‌వేర్‌ పూర్తిగా ఉచితం అయినందున దాన్ని వినియోగించుకున్నట్లయితే జీహెచ్‌ఎంసీకి ఖర్చు తగ్గేది. అసలే ఆర్థిక భారం పెరిగిపోయిన పరిస్థితుల్లో ఖర్చు తగ్గడమే కాక, బోగస్‌ సర్టిఫికెట్ల జారీ వంటి అవకతవకలకు ఆస్కారం ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

► అన్ని విధాలా ఆమోదయోగ్యమైన ఆ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకోకపోవడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. దేశమంతటా ఒకే విధమైన యూనిఫామ్‌ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ ఉండాలనే తలంపుతోనే కేంద్ర ప్రభుత్వం ఓఆర్‌జీఐ పోర్టల్‌ అందుబాటులోకి తెచ్చినట్లు ఈ అంశంలో అవగాహన ఉన్నవారు చెబుతున్నారు. దాని ద్వారా ఆన్‌లైన్‌లో జనన, మరణాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసే సదుపాయంతోపాటు ఆయా వివరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా గణాంకాలు వెలువరించే సందర్భాల్లో సైతం ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు. (క్లిక్: ఆకాశంలో నడక.. అక్కడే  టీ, కాఫీ, స్నాక్స్‌)

► ఆన్‌లైన్‌లోని వివరాలను, సమాచారాన్ని వివిధ స్థాయిల్లోని ఉన్నతాధికారులు వీక్షించి, పర్యవేక్షించేందుకు సైతం సదుపాయం ఉంటుందన్నారు. జీహెచ్‌ఎంసీకి సాఫ్ట్‌వేర్‌ నిర్వహణ ఖర్చు కూడా ఉండేది కాదని  చెబుతున్నారు. అయినప్పటికీ, దాన్ని వినియోగించుకోకుండా సొంత పోర్టల్‌ను వాడుతుండటమే సందేహాలకు తావిస్తోంది. (క్లిక్: హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌ల వైశాల్యం ఎంతో తెలుసా?)

మరిన్ని వార్తలు