జోయ్‌ బర్త్‌డే.. ఈ కుక్కకి రోజు వచ్చిందోచ్‌ !

24 Aug, 2021 09:32 IST|Sakshi

బషీరాబాద్‌: మనుషులు బర్త్‌డేలు చేసుకోవడం అందిరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఓ కుక్క బర్త్‌డే చేసుకుంది. అదేంటి కుక్క బర్త్‌డే చేసుకోవడమేంటని ఆశ్చర్యపోకండి. ప్రతీ కుక్కకి ఓ రోజు వస్తుందనే సామెత ఉందిగా.. అలా ఈ రోజు జోయ్‌ ది అన్నమాట. ఇటీవల నగరాల్లో సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, సంపన్నులు వారి ఇళ్లళ్లో పెంపుడు కుక్కలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న ‘జోయ్‌’ అనే కుక్క సోమవారం తన రెండో పుట్టిన రోజును జరుపుకొంది. తన బర్త్‌డే సందర్భంగా కేక్‌కట్‌ చేసింది.

ఇది ఎక్కడ జరిగిందనుకుంటున్నారా..? హైదరాబాద్‌లోని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, వికారాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి ఇంట్లోనే. మూగజీవాలను అమితంగా ప్రేమించే సునీతారెడ్డి తన పెంపుడు కుక్కకు రెండో పుట్టిన రోజు సందర్భంగా ఇలా బర్త్‌డే చేశారు. ఇదండీ మ్యాటరు. 

ఆన్‌లైన్‌ తరగతులపై దృష్టి సారించాలి  
దోమ: విద్యార్థుల ఆన్‌లైన్‌ తరగతులపై ప్రతి ఉపాధ్యాయుడు ప్రత్యేక దృష్టి సారించాలని దోమ మండల విద్యాధికారి హరిశ్చందర్‌ అన్నారు. సోమవారం మండల పరిధిలోని పలుగుతండా, కుమ్మరికుంటతండా, బుద్లాపూర్, హుస్సేన్‌ నాయక్‌ తండాలలోని పాఠశాలలను ఆయన సందర్శించారు. పాఠశాలలలో విద్యార్థుల విద్యాబోధన గురించి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రతి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులను బోధించాలన్నారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతుల పట్ల ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బుద్లాపూర్‌ సర్పంచ్‌ మారోనిబాయ్, పాండు నాయక్, సీఆర్‌పీ రెడ్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు