ఉద్రిక్తత: మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ

1 Feb, 2021 19:19 IST|Sakshi

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. కోనరావుపేటలో మంత్రి కాన్వాయ్‌ని బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని పక్కకు నెట్టేశారు. ఈ క్రమంలో అక్కడున్న టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే పరకాల ఎమ్మెల్యే ఇంటిపై దాడిపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేసి వారికి వార్నింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి పర్యవసానంగా కేటీఆర్‌కు సొంత జిల్లాలో బీజేపీ శ్రేణులు నిరసన తెలిపారు. సిరిసిల్ల పర్యటనకు సోమవారం మంత్రి కేటీఆర్‌ వచ్చారు. ఈ క్రమంలో మంత్రి కాన్వాయ్‌ని కోనరావుపేటలో బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఘెరావ్ చేసేందుకు యత్నించారు.

వరంగల్ ఘటన నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. రైతు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చిన కేటీఆర్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. కాన్వాయ్‌లోకి కార్యకర్తలు దూసుకువచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్త ఒకరు పోలీసులను చేదించుకుని రోడ్డుపైకి దూసుకురావడంతో కానిస్టేబుల్ గట్టిగా పట్టుకున్నాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కార్యకర్తల ప్రయత్నాన్ని టీఆర్ఎస్ శ్రేణులు ప్రతిఘటించారు. దీంతో బీజెపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాటతో ఘర్షణ వాతావరణం ఏర్పడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎస్ శ్రేణులు వెళ్లగొట్టారు. అప్పటికే పోలీసులు పలువురు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకోగా వారిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. వెంటనే కమలం కార్యకర్తలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం మంత్రి కేటీఆర్ పర్యటన పోలీసుల సహాయంతో సాఫీగా సాగింది.
 

మరిన్ని వార్తలు