2023లో అధికారంలోకి రావడమే మా లక్ష్యం!

2 Apr, 2021 03:28 IST|Sakshi

లక్ష్య సాధనకు బీజేవైఎం కృషి చేయాలి

బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో 2023లో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యమని, ఆ లక్ష్య సాధనకు యువ మోర్చా కార్యకర్తలు పని చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో జరిగింది. ఎందరో ప్రాణ త్యాగాలు చేస్తే బీజేపీ ఈ స్థాయికి వచ్చిందని, వారి లక్ష్య సాధనకు ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. గోల్కొండ కోటపై కాషాయ జెండానే మనకు కన్పించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో మూర్ఖత్వపు పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం జల్సా చేస్తోందని మండిపడ్డారు.

అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం చేరి.. దోచుకుంటోందని ఆరోపించారు. రాక్షస పాలన నుంచి రాష్ట్ర విముక్తి కోసం యువమోర్చా పోరాటం చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఏ పార్టీతో పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. కొందరు టీఆర్‌ఎస్‌తో పొత్తు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఎన్నికలు వస్తున్నాయంటేనే ఈ ప్రభుత్వానికి ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. యువ మోర్చా ఉద్యమంతో కేసీఆర్‌కు వణుకు పుట్టాలన్నారు. యువ మోర్చా కార్యకర్తలకు క్రమశిక్షణ, ఓపిక ముఖ్యమన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు న్యాయం జరగాలంటే బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు.

ఈ ప్రభుత్వం కార్పొరేట్‌ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావి వర్గం తీసుకున్న నిర్ణయం బాధ కలిగించిందన్నారు. ప్రభుత్వాన్ని హెచ్చరించేందుకు నాగార్జునసాగర్‌లో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి సీటు ఇచ్చామన్నారు. పోలీసులకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, భైంసాలో రిపోర్టర్లపై హిందూ వాహిని కార్యకర్తలు దాడి చేశారా అనేది ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టిన పోలీస్‌ అధికారి చెప్పాలని పేర్కొన్నారు. లవ్‌ జిహాద్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని, ప్రైవేటు టీచర్లకు గౌరవవేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 19న అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్, యువమోర్చా ఇన్‌చార్జి ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు