ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకే: బీజేపీ

22 Sep, 2020 16:16 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్ష పార్టీలు నిరసనలతో హోరెత్తించాయి. ఎల్ఆర్ఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌ వద్ద బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ చౌరస్తా నుంచి ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకొని ధర్నా చేశారు. ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్​ పేరుతో పేదలను ఇబ్బందులకు గురి చేస్తుందని బీజేపీ నేతలు మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మనోదైర్యం కల్పించాల్సిన ప్రభుత్వం ఖజానా నింపుకునేందుకు ఎల్ఆర్‌ఎస్‌ను విధించిందని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్‌ను రద్దు చేయాలని, లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్ పాల్గొన్నారు.

రోడ్డు పనులు పూర్తి చేయాలంటూ కాంగ్రెస్ నిరసన
మరోవైపు మహబూబ్‌నగర్ పట్టణంలో నత్తనడకన రోడ్డు విస్తరణ పనులు సాగుతున్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాగా పార్టీ నేతలు ర్యాలీగా వెళ్లి పనులను పరిశీలించారు. రహదారి పక్కన పెద్దపెద్ద గోతులు తీసి నెలల తరబడి పనులు పెండింగ్‌లో పెట్టారని, దీంతో తాము అవస్ధలు పడుతున్నామని, తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని షాపుల యజమానులు నేతల దృష్టికి తీకుకొచ్చారు. అయితే  వినియోగదారులు తమ షాపుల్లో కొనుగోళ్లు చేసేందుకు వీలులేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. వెంటనే పనులు పూర్తి చేయాలని, ప్రభత్వం నిర్లక్క్ష్యం వహిస్తే తమ ఆందోళనలను ఉదృతం చేస్తామని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు.  ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎన్పీ వెంకటేష్ పాల్గొన్నారు. (చదవండి: కొత్త పురపాలికల్లో నవంబర్‌ వరకు ఎల్‌ఆర్‌ఎస్‌)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు