మునుగోడులో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి: బీజేపీ నేత వివేక్‌ 

25 Sep, 2022 04:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో విజయమే లక్ష్యంగా కార్యాచరణకు బీజేపీ స్టీరింగ్‌ కమిటీ నడుం బిగించింది. దసరా తర్వాత అక్కడ గడపగడపకూ బీజేపీ పేరిట కార్యక్రమాన్ని చేపట్టాలని, ఈ నియోజకవర్గం పరిధిలో కేంద్రమంత్రులతో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్రమంత్రులు, ముఖ్యనేతలతో ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహిస్తే మంచిదనే దానిపై చర్చించింది.

మునుగోడులోని ఆరు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు ఇన్‌చార్జి, ఇద్దరు సహ ఇన్‌చార్జిల చొప్పున 24 మందిని నియమించింది. ఎమ్మెల్యే, మాజీ ఎంపీలకు ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగించింది. సంస్థాన్‌ నారాయణపూర్‌కు ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, మునుగోడుకు చాడ సురేశ్‌రెడ్డి, మర్రిగుడెంకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, చౌటుప్పల్‌కు కూన శ్రీశైలంగౌడ్, నాంపల్లికి ఏనుగు రవీందర్‌రెడ్డి, చండూర్‌కు నందీశ్వర్‌గౌడ్, చౌటుప్పల్‌ మున్సిపాలిటీకి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, చండూర్‌ మున్సిపాలిటీకి ఎం.ధర్మారావులను నియమించింది.

శనివారం ఆ పార్టీ కార్యాలయంలో కమిటీ చైర్మన్‌ మాజీ ఎంపీ జి.వివేక్‌ వెంకటస్వామి అధ్యక్షతన స్టీరింగ్‌ కమిటీ తొలిసారిగా సమావేశమైంది. ఈ భేటీ అనంతరం వివేక్‌ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ సర్కార్‌ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల్లో సర్కార్‌పై ఉన్న వ్యతిరేకత గురించి పార్టీపరంగా చార్జ్‌షీట్‌ సిద్ధం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.

ఈ నెల 27న చౌటుప్పల్‌ మండలంలో మండల ఇన్‌చార్జీల సమావేశం ఉంటుందన్నారు. మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజ్‌గోపాల్‌రెడ్డి, స్టీరింగ్‌ కమిటీ సమన్వయకర్త డా.గంగిడి మనోహర్‌రెడ్డి, సభ్యులు ఈటల రాజేందర్, ఏపీ జితేందర్‌రెడ్డి, కె.స్వామిగౌడ్, యెండెల లక్ష్మీనారాయణ, గరికపాటి మోహన్‌రావు, డా.దాసోజు శ్రవణ్‌ హాజరయ్యారు.  

హెచ్‌సీఏలో గందరగోళం ఇలా.. 
కల్వకుంట్ల కుటుంబం కారణంగానే హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)లో గందరగోళ పరిస్థితి నెలకొందని హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వివేక్‌ ఆరోపించారు. కవితను హెచ్‌సీఏ అధ్యక్షురాలిని చేయాలని సీఎం కేసీఆర్‌ చూస్తున్నారన్నారు. గతంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా పోటీ చేయొద్దని తనకు కేసీఆర్‌ సూచించారన్నారు.    

మరిన్ని వార్తలు