కవిత విషయంలో తప్పుగా మాట్లాడలేదు.. మహిళా కమిషన్‌ ముందు బండి సంజయ్‌

18 Mar, 2023 14:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వివరణ ఇచ్చారు. ఈ మేరకు మహిళా కమిషన్‌కు సమాధానం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఒక సామెతను మాత్రమే వాడనని పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయలేదు కాబట్టే మహిళా కమిషన్‌ ముందు హాజరయ్యానని తెలిపారు. 

కవిత విషయంలో తప్పుగా మాట్లాడలేదని అన్నారు. తనెవరినీ కించపరచలేదని అన్నారు. కేసులోని నిందుతురాలు రేణుక కుటుంబ సభ్యులు బీఆర్‌ఎస్‌ నేతలేనని బండి సంజయ్‌ ఆరోపించారు. పేపర్‌ లీక్‌ కేసును సిట్టింగ్‌ జడ్జితో ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు.  కాగా  బండి సంజయ్‌ శనివారం రాష్ట్ర మహిళా కమిషన్‌ ముందు హాజరైన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బుద్ధ భవన్‌లోని మహిళా కమిషన్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. బీజీపీ లీగల్‌ సెల్‌  మహిళా న్యాయవాదులతో కలిసి కమిషన్‌ కార్యాలయానికి వెళ్లారు. 

ఇదిలా ఉండగా బండి సంజయ్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్తలు మహిళా కమిషన్ వద్ద ఆందోళన చేపట్టారు. బీజేపీ నేతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవితపై వ్యాఖ్యలు చేసిన బండి  క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కాగా ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యల్ని సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మహిళా కమిషన్‌.. సంజయ్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్చి 15న కమిషనర్‌ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించగా.. తనకు పార్లమెంట్‌ సమావేశాలు ఉన్నందున 18న హాజరవుతానని ఆయన కమిషన్‌ను కోరారు. ఇందుకు కమిషన్‌ సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో శనివారం ఉదయం ఆయన కమిషన్‌ ఎదుట హాజరయ్యారు.
చదవండి: టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌పై కేసీఆర్‌ సీరియస్‌.. ఉన్నతస్థాయి సమీక్ష..

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు