భైంసాలో టెన్షన్‌.. టెన్షన్‌..!

28 Nov, 2022 03:40 IST|Sakshi

‘బండి’ యాత్రకు పోలీసుల అనుమతి నిరాకరణ 

కోర్టు తలుపు తడతాం.. సభ నిర్వహించి తీరుతామంటున్న బీజేపీ  

ఏం జరుగుతుందోనని స్థానికుల్లో ఆందోళన

భెంసాటౌన్‌/ఆదిలాబాద్‌/హైదరాబాద్‌: నిర్మల్‌ జిల్లా భైంసా నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టే ఐదో విడత ప్రజాసంగ్రామయాత్రకు అనుమతి నిరాకరించినట్లు భైంసా ఏఎస్పీ కిరణ్‌ ఖారె తెలిపారు. భైంసాలో నిర్వహించే సభకు కూడా అనుమతి లేదని పేర్కొన్నారు. భైంసాలోని సున్నిత పరిస్థితుల దృష్ట్యా పాదయాత్రతోపాటు సభకు ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ అనుమతి నిరాకరించినట్లు వెల్లడించారు. ప్రజాసంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

రెండు, మూడురోజులుగా ఎంపీ సోయం బాపురావు, ఇతర జిల్లాల నాయకులు భైంసాలోనే మకాం వేసి సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పార్డి(బి) బైపాస్‌ రోడ్‌లో జరిగే భారీ బహిరంగసభకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పారీ్టకి రాజీనామా చేసిన డీసీసీ మాజీ అ«ధ్యక్షుడు రామారావు పటేల్‌ ఈ సభావేదికగానే బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ మేరకు పట్టణంలో భారీఫ్లెక్సీలతో విస్తృత ప్రచారం చేసుకున్నారు. బీజేపీ టికెట్‌ ఆశావహులు సైతం భైంసా రహదారులను ఫ్లెక్సీలతో కాషాయమయం చేశారు. ఈ నేపథ్యంలో బండి యాత్రకు అనుమతి నిరాకరించడంతో ఎప్పుడేం జరుగుతుందోననే టెన్షన్‌ నెలకొంది.  

ఎంఐఎంకు భయపడే: సోయం  
ఎంఐఎంకు భయపడే సంజయ్‌ యాత్రకు అనుమతి ఇవ్వట్లేదని ఎంపీ సోయం బాపురావ్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజాసమస్యలను పరిష్కరించలేక బండి యాత్రను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని పేర్కొన్నారు. ‘న్యాయస్థానం తలుపు తడతాం. న్యాయస్థానం అనుమతి తీసుకుని యాత్ర కొనసాగిస్తాం’అని ప్రకటించారు. ‘సభావేదిక వేసేదాక చూసి, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దిగే హెలీప్యాడ్‌ను కూడా పరిశీలించిన పోలీసులు అకస్మాత్తుగా అనుమతి రద్దు చేయడం వెనుక సీఎం కేసీఆర్‌ ప్రోద్బలం ఉంది’అని పేర్కొన్నారు. యాత్రతో బీజేపీకి ప్రజాదరణ పెరుగుతుందని భయపడి, అనుమతులు నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు.  

అడ్డుకోవడం పిరికిపంద చర్య: డీకే అరుణ 
సంజయ్‌ పాదయాత్రను అడ్డుకోవడం సీఎం కేసీఆర్‌ పిరికిపంద చర్యకు నిదర్శనమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ప్రజల కోసం చేస్తున్న యాత్రగా కేసీఆర్‌ గ్రహించి అనుమతించాలని ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రజల్లో టీఆర్‌ఎస్‌పై పెరుగుతున్న వ్యతిరేకతను తట్టుకోలేకనే బీజేపీని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ‘మత ఘర్షణలు జరుగుతాయనే సాకుతో అడ్డుకోవడం సరికాదు. తెలంగాణ పోలీసులకు సత్తా ఉంటే యాత్రకు అనుమతివ్వాలి. బందోబస్తులో ఉండి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి.అయితేనే పోలీస్‌ వ్యవస్థకు మనుగడ ఉన్నట్లు’అని అరుణ పేర్కొన్నారు. 

భైంసా సభను అడ్డుకోవడం కుట్ర రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది: కె.లక్ష్మణ్‌ 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, బీజేపీ ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించ తలపెట్టిన భైంసా సభకు అనుమతి నిరాకరించడం సరికాదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌ మండిపడ్డారు. తెల్లారితే సభ ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను నిర్మల్‌ వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు.

భైంసా సభను అడ్డుకోవడం వెనుక కేసీఆర్‌ కుట్ర ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి కేసీఆర్‌కు భయం పట్టుకుందని, ఆయన ఎన్ని కుట్రలు చేసినా బీజేపీని ఆపలేరని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కల్వకుంట్ల కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కేసీఆర్‌ తనకు తాను నయా నిజాం అనుకుంటున్నారని.. నిజాం మెడలు వంచినట్లే కేసీఆర్‌ నిరంకుశ పాలనకు అంతం పలికే రోజు దగ్గర్లోనే ఉందని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: జగిత్యాలలో హై టెన్షన్‌.. బండి సంజయ్‌ మరోసారి అరెస్ట్‌

మరిన్ని వార్తలు