Bandi Sanjay: బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్.. జైలుకు తరలింపు..

5 Apr, 2023 18:30 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: మంగళవారం అర్ధరాత్రి అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను  హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్‌ అనిత రావుల ముందు హాజరుపరిచారు పోలీసులు.  బండి సంజయ్‌తో పాటు ప్రశాంత్, శివ గణేష్, మహయ్‌లను కూడా మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లారు. టెన్త్‌ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం, బండి సంజయ్‌ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు.

వాడీవేడీగా వాదనలు..
టెన్త్‌ పేపర్‌ లీక్ కేసులో ఏ1గా ఉన్న బండి సంజయ్‌ను విచారించేందుకు 14 రోజుల రిమాండ్‌ విధించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు మెజిస్ట్రేట్‌ను కోరారు. మరోవైపు బండి సంజయ్ అరెస్టు అక్రమమని అతని తరఫు న్యాయవాదులు వాదించారు. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాదనల అనంతరం దాదాపు రెండు గంటల తర్వాత మెజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు.

భారీ భద్రత..
అంతకుముందు ముందుజాగ్రత్త చర్యగా హన్మకొండ కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే బండిని కోర్టు నుంచి మెజిస్ట్రేట్ ఇంటి వద్దకు తీసుకెళ్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బండి అరెస్టును నిరసిస్తూ వారు పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో ఇరవర్గాల మధ్య తోపులాటలు జరిగాయి.

ఖమ్మం జైలుకు..
తీర్పు అనంతరం బండి సంజయ్‌ను కరీంనగర్‌ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మెజిస్ట్రేట్ ఇంటి వద్దకు బీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

చొక్కా విప్పిన బండి..
కాగా.. పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారని బండి సంజయ్ తన న్యాయవాదులకు చెప్పారు. చొక్కా తీసి తన ఒంటిపై గాయాలను కూడా చూపించారు. పోలీసులు వ్యవహరించిన తీరు, అరెస్టు చేసిన విధానాన్ని బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులకు బండి వివరించారు.
చదవండి: బండి సంజయ్‌పై నమోదైన కేసు ఇదే.. అరెస్టుపై అమిత్‌షా ఆరా.. ఏం జరిగిందో చెప్పిన కిషన్ రెడ్డి..

మరిన్ని వార్తలు