ప్రజా గోస బీజేపీ భరోసా.. ప్రజల మద్దతు కోరుతూ మిస్డ్‌కాల్‌ ఉద్యమం

21 Jul, 2022 01:25 IST|Sakshi

సిద్దిపేట, వేములవాడలో పాల్గొననున్న బండి సంజయ్‌

టీఆర్‌ఎస్‌ పాలనపై పోరాటం

ప్రజల మద్దతు కోరుతూ  6359199199 నంబర్‌తో మిస్డ్‌కాల్‌ ఉద్యమం

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ ఆధ్వర్యంలో ‘ప్రజా గోస బీజేపీ భరోసా’ పేరిట నిర్వహిస్తున్న బైక్‌ ర్యాలీని గురువారం సిద్దిపేటలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రారంభిస్తారు. అనంతరం వేములవాడలో నిర్వహించే బైక్‌ర్యాలీ లోనూ సంజయ్‌ పాల్గొంటారు. తొలివిడతలో రాష్ట్రంలోని 6 ఎంపీ స్థానాల్లోని, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ర్యాలీలను సమాంతరంగా మొదలుపెడతారు.

ఈ ర్యాలీలకు తాండూరులో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సిద్దిపేటలో పార్టీ మధ్యప్రదేశ్‌ ఇంచార్జి మురళీధర్‌రావు, జుక్కల్‌లో జాతీయ కార్యవర్గ సభ్యుడు డా.వివేక్‌ వెంకటస్వామి, బోధన్‌లో బీజేఎల్పీ నేత టి.రాజాసింగ్, నర్సంపేటలో పార్టీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, వేములవాడలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ నేతృత్వం వహిస్తారని పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, బైక్‌ ర్యాలీ ఇంచార్జి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు.

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అప్రజాస్వామిక, నియంత, కుటుంబపాలనపై బీజేపీ చేస్తున్న పోరాటానికి ప్రజా మద్దతు కోరుతూ 6359199199 మొబైల్‌ నంబర్‌ ఏర్పాటు చేశామన్నారు. బీజేపీకి మద్దతు ఇవ్వాలనుకున్న వారు ఈ నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని కోరారు. ఫసల్‌ బీమా, డబుల్‌ బెడ్‌రూమ్‌లు, నిరుద్యోగం, ఇతర అంశాలపై ఇబ్బందులను తెలుసుకుని ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. 

త్వరలో మరో 7 నియోజకవర్గాల్లో...
త్వరలోనే మరో 7 నియోజకవర్గాల్లో బైక్‌ ర్యాలీలు ప్రారంభమవుతాయని ప్రేమేందర్‌రెడ్డి చెప్పారు. దేవరకద్రలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, ఆదిలాబాద్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్, వైరాలో ఎంపీ సోయం బాపూరావు, మేడ్చల్‌లో జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి, దేవరకొండలో జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, ఇబ్రహీంపట్నంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కల్వకుర్తిలో బాబూమోహన్‌ పాల్గొనను న్నారు. ‘100 టీఎంసీలు ఎత్తిపోయనోడివి లక్ష కోట్లకు పైగా డబ్బులు పెట్టి కాళేశ్వరం ఎందుకు కట్టినట్టు? వరద లతో 1,200 టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిశాయి’ అని ఆయన సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు