మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఇల్లు ముట్టడి

30 Nov, 2020 13:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌( జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో పోలీసులు టీఆర్‌ఎస్‌ పార్టీకి కొమ్ము కాస్తున్నారని బీజేపీ శ్రేణులు నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ డబ్బులు, మద్యం విచ్చలవిడిగా పంచినా వారిపై కేసులు నమోదు చేయడం లేదని రఘునందన్ రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ ఆగడాలపై ప్రశ్నించిన తమపై కేసులు నమోదు చేసి దాడులు చేస్తున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. 

మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఇల్లు ముట్టడి: 
మాన్సూరాబాద్ డివిజన్‌లో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్న ఇంటిని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. డివిజన్ నుంచి వెళ్లిపోవాలంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సూర్యాపేట నుంచి వచ్చిన వాళ్ల వెంటనే వెళ్లిపోయి, ప్రజాస్వామ్యాన్ని కాపాడలంటూ ఎమ్మెల్యే  సుధీర్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డిలతో పాటు తెరాస నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని బీజేపీ అభ్యర్థి కొప్పుల నరసింహరెడ్డి అన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడినుండి మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వెనుదిరిగారు.

చిన్నారులతో డబ్బు పంపిణీ: 
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కార్పొరేట్‌ అభ్యర్థులు డబ్బుల పంపిణీకి కొత్త పంథా ఎంచుకున్నారు. కార్యకర్తలతో పంపిణీ చేస్తే పోలీసులు, ప్రతిపక్షాల నుంచి తలనొప్పులు వస్తాయని ఎవరికి అనుమానం రాకుండా చిన్న పిల్లలు ద్వారా డబ్బు పంపినీకి పూనుకున్నారు. నగరంలోని ఎల్‌బీ నగర్ నియోజకవర్గ పరిధిలో గడ్డిఅన్నారం డివిజన్‌లో చిన్నారులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ కెమెరాకు చిక్కారు. అయితే వీడియో తీయడం చూసి ఆ చిన్నారులు వెళ్లిపోవడంతో.. వారు ఎవరి పార్టీ  తరుఫున నగదు పంచుతున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

మరిన్ని వార్తలు