నేరేడ్‌మెట్‌ కార్పొరేటర్‌ ఎన్నికపై హైకోర్టు ఆదేశం

7 Dec, 2020 15:22 IST|Sakshi

నేరేడ్ మెట్ ఫలితం వెల్లడికి తొలగిన అడ్డంకులు

సాక్షి, హైదరాబాద్‌: నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితం వెల్లడికి అడ్డంకి తొలగింది. నేరేడ్‌మెట్‌ కార్పొరేటర్‌ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.ఇతర ముద్రతో ఉన్న ఓట్లను పరిగణనలోకి తీసుకునేందుకు హైకోర్టు అనుమతి సోమవారం ఆదేశాలు ఇచ్చింది. స్వస్తిక్ గుర్తు బదులు మరొక గుర్తుకు వచ్చిన 544  ఓట్లను లెక్కించాలంటూ తీర్పునిచ్చిన హైకోర్టు... లెక్కించకుండా మిగిలిపోయిన ఓట్లను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉంటే... రిటర్నింగ్ ఆఫీసరే తుది నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు ఎన్నికల కమిషన్‌కు విచక్షణ అధికారం ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది.

అలాగే ఎన్నికల సంఘం వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. స్వస్తిక్ గుర్తుతో పాటు ఇతర గుర్తులను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇవ్వగా, దాన్ని సవాల్‌ చేస్తూ బీజేపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్నఅనంతరం హైకోర్టు ఈ మేరకు తీర్పు నిచ్చింది. అలాగే బీజేపీ లీగల్ సెల్ ఇంచార్జి ఆంటోనీ రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఎన్నికపై వివాదం ఉంటే ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించ వచ్చునన్న న్యాయస్థానం తెలిపింది.  దీంతో నేరేడ్‌మెట్‌ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది.

కాగా ఈనెల 1న జరిగిన పోలింగ్‌లో డివిజన్‌లోని చాలా పోలింగ్‌ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని, అధికార పార్టీకి ఎన్నికల అధికారులు అనుకూలంగా వ్యవహరించి 600కుపైగా చెల్లని ఓట్లను టీఆర్‌ఎస్‌ ఖాతాలో వేశారని బీజేపీ అభ్యర్థి ప్రసన్ననాయుడు ఆరోపించారు. తమతో పాటు కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయమై ఎన్నికల అధికారిపై స్థానిక పోలీసులకు  ఫిర్యాదు చేసినట్టు ఆమె వివరించారు. డివిజన్‌లో మొత్తం పోలైన ఓట్లకు, కౌటింగ్‌లో అధికారులు చెబుతున్న ఓట్ల సంఖ్యకు మధ్య తేడా ఉందన్నారు. ఇక 50వ పోలింగ్‌ కేంద్రంలోని 544 ఓట్లపై స్వస్తిక్‌ గుర్తుకు బదులు వేలిముద్రతో పాటు వేరే ఇంకు గుర్తులు ఉన్న అంశం కోర్టు విచారణలో ఉందని, ఈ ఓట్లపై కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. పొరపాట్లకు కారణమైన అధికారులపై కోర్టుకు వెళతానని ప్రసన్న నాయుడు స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు