పదోన్నతులు అడిగితే సస్పెండ్‌ చేస్తారా?

22 Feb, 2023 03:20 IST|Sakshi

భాషా పండితుల సమస్యలను పరిష్కరించాలి  

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ  

సాక్షి, హైదరాబాద్‌: భాషా పండితులను సస్పెండ్‌ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల ఉపసంహరణతోపాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వారి ప్రమోషన్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విజ్ఞప్తిచేశారు. ఈమేరకు ఆయన లేఖరాశారు.

మంగళవారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా భాషా పండితులు చేస్తున్న సేవలకు వారిని సత్కరించాల్సిందిపోయి.. ప్రమోషన్లు అడిగినందుకు ముగ్గురు భాషా పండితులను సస్పెండ్‌ చేయడం గర్హనీయమన్నారు. రాష్ట్రంలో 8,500 మందికిపైగా ఉన్న భాషా పండితులకు 22 ఏళ్లుగా ప్రమోషన్లు ఇవ్వలేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. గతంలో హైదరాబాద్‌లో జరిగిన తెలుగు మహాసభల్లో భాషా పండితులకు వెంటనే ప్రమోషన్లు కల్పిస్తామని సీఎం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. 

అధికారిక లాంఛనాల్లోనూ ఇదేం వివక్ష?  
ఎమ్మెల్యేగా ఐదుసార్లు గెలిచి ప్రజలకు సేవ చేసిన దళిత నేత సాయన్న అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించకపోవడం శోచనీయమని బండి సంజయ్‌ మండిపడ్డారు. నిజాం రాజు వారసుడికి మాత్రం అధికారిక లాంఛనాలతో ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించిందని ఎద్దేవాచేశారు.

దళితుడైన సాయన్న విషయంలో వివక్ష చూపడం క్షమించరానిదన్నారు. అంబర్‌పేటలో గంగపుత్ర సామాజికవర్గానికి చెందిన 4 ఏళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మరణిస్తే సీఎం కేసీఆర్‌ స్పందించకపోవడం బాధాకరమన్నారు.    

మరిన్ని వార్తలు