21 నుంచి ‘పల్లె గోస–బీజేపీ భరోసా’

11 Jul, 2022 01:07 IST|Sakshi

ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్‌ర్యాలీలు

ఆగస్టు 2 నుంచి బండి సంజయ్‌ పాదయాత్ర–3

బీజేపీ కోర్‌కమిటీ భేటీలో పలు అంశాలపై నిర్ణయం

పాల్గొన్న తరుణ్‌చుగ్, బండి సంజయ్, ఇతర ముఖ్య నేతలు 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, సంస్థాగతంగా బలపడుతూనే క్షేత్రస్థాయిలో ప్రజా మద్దతును కూడగట్టేందుకు రాష్ట్ర బీజేపీ వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 21 నుంచి ‘పల్లె గోస–బీజేపీ భరోసా’పేరిట అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్‌ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు.

దీంతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రజాసంగ్రామయాత్ర–3’ను ఆగస్టు 2 నుంచి 20 రోజుల పాటు చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఆదివారం బండి సంజయ్‌ అధ్యక్షతన జరిగిన కోర్‌ కమిటీ భేటీకి పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ హాజరయ్యారు. పార్టీనేతలు డీకే అరుణ, నల్లు ఇంద్రసేనారెడ్డి, మురళీధర్‌రావు, ఈటల రాజేందర్, జి.వివేక్‌ వెంకటస్వామి, గరికపాటి మోహనరావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి,

దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి, మంత్రి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. సంస్థాగతంగా బలోపేతం, క్షేత్రస్థాయి దాకా పార్టీ విస్తరణ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడం, రాబోయేరోజుల్లో నిర్వహించాల్సిన వివిధ కార్యక్రమాలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. కోర్‌కమిటీ సమావేశానంతరం సాయంత్రం వరకు వేర్వేరుగా జరిగిన వివిధ కమిటీల సమావేశాల్లో సంజయ్, తరుణ్‌ చుగ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, ఇతర నేతలు పాల్గొన్నారు.

త్వరలో ప్రజాసంగ్రామ యాత్ర–3 వివరాలు..
ఆగస్టు 2 నుంచి ప్రారంభమయ్యే ప్రజాసంగ్రామ యాత్ర–3 రూట్, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తరుణ్‌ చుగ్‌ మీడియాకు తెలిపారు. ‘పల్లె గోస–బీజేపీ భరోసా’పేరిట చేపట్టే కార్యక్రమంలో బండి సంజయ్‌ ఆధ్వర్యంలో దాదాపు 30 మంది సీనియర్‌ నేతలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తారని, రాత్రి పూట పల్లెల్లోనే బస చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్‌ నియంత పాలనలో గోస పడుతున్న ప్రజలకు న్యాయం జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా, నర్సంపేట నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తరుణ్‌ చుగ్, బండి సంజయ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. 

పకడ్బందీగా ఆపరేషన్‌ ఆకర్‡్ష..
రాష్ట్రస్థాయి మొదలుకుని జిల్లా, నియోజకవర్గస్థాయి వరకు అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులను చేర్చుకునే విషయంలో పకడ్బందీగా ‘ఆపరేషన్‌ ఆకర్‌‡్ష’ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీపరంగా ఏయే నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు లేరో ప్రధానంగా ఆచోట్ల ఇతర పార్టీల్లోని బలమైన నేతలను చేర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు.

ఆయా పార్టీల నేతలు బీజేపీలో చేరేదాకా ఆ విషయంపై పూర్తిగా రహస్యం పాటి స్తూ, వారి పేర్లు ముందుగానే బయటపడకుండా జాగ్ర త్తలు తీసుకోవాలని రాష్ట్ర పార్టీని జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్‌చుగ్‌ ఆదేశించారు. ఈటల రాజేందర్‌ కన్వీనర్‌గా ఏర్పాటైన చేరికల కమిటీ ఆదివారం సాయంత్రం తొలి సారిగా భేటీ అయినపుడు పలు అంశాలు చర్చకు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ నుంచి ముఖ్యమైన నాయకులను చేర్చుకునే విష యంలో ఇప్పటికే రహస్య కార్యాచరణ మొదలుపెట్టినట్టు ఈటల రాజేందర్‌ తెలిపారని సమాచారం. ఆపరేషన్‌ ఆకర్‌‡్షలో ముందస్తు లీకులు ఇవ్వకూడదని నిర్ణయించారు. 

ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంపై చర్చ
ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను చేర్చుకొని అంగబలం పెంచుకోవడంతో పాటు టీఆర్‌ఎస్‌ను ఢీకొట్ట డానికి ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలని బీజేపీ ఫైనా న్స్‌ కమిటీ నిర్ణయించింది. ఈ కమిటీ సమావేశంలో పార్టీ ఆర్థిక వనరులపై చర్చించారు. ఎంపీ అర్వింద్‌ నాయ కత్వంలో ఏర్పాటైన టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై అధ్యయన కమిటీ కూడా వివిధ అంశాలపై చర్చ జరిపింది.  

మరిన్ని వార్తలు