‘సంతోష్‌ను ఇరికించి సర్కార్‌ ఆరెస్సెస్‌తో పెట్టుకుంది’

9 Jan, 2023 04:19 IST|Sakshi

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సమర్థంగా ఎదుర్కోవాలి

సమష్టిగా కృషి చేసి బీజేపీని గెలిపించాలి

పరివార్‌ సంస్థలు, అనుబంధ విభాగాలతో ఆరెస్సెస్‌ ముఖ్యుల భేటీ

తరుణ్‌ ఛుగ్, సునీల్‌ బన్సల్‌ సహా ముఖ్య నేతలు హాజరు

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణలో ఒక యుద్ధవాతా వరణం మాదిరి పరిస్థితుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు సమష్టిగా కృషి చేయాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సమర్థంగా ఎదుర్కొని ఆరెస్సెస్‌ అనుకూల శక్తులు విజయం సాధించేందుకు ఇప్పటినుంచే కార్యరంగంలోకి దిగాలి. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి (ఆరెస్సెస్‌ నేత) బీఎల్‌ సంతోష్‌ను ఇరికించి, నోటీసులివ్వడం ద్వారా కేసీఆర్‌ సర్కార్‌ ఆరెస్సెస్‌తో పెట్టుకుంది.

ఇందుకు రాజకీయంగా తగిన గుణపాఠం చెప్పాలి..’ అని అన్ని పరివార, అనుబంధ సంఘాలకు సంఘ్‌ పరివార్‌ పిలుపునిచ్చింది. తెలంగాణ సెంటిమెంట్, ప్రత్యేక రాష్ట్ర వాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ కూడా బీఆర్‌ఎస్‌ ఏర్పాటుతో బలహీనపడడంతో పాటు ప్రజలెవరూ విశ్వసించని స్థితికి చేరుకున్నందున ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని చెప్పినట్టు తెలిసింది. ఆదివారం నగర శివార్లలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో.. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాలి్సన వ్యూహంపై సంఘ్‌ పరివార్, పరివార సంస్థలు, అనుబంధ విభాగాలతో ఆరెస్సెస్‌ జాతీయ నేతలు సమాలోచనలు జరిపారు. 

అధికారమే లక్ష్యంగా కృషి చేయాలి
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ, పార్టీపరంగా ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, ఇంకా బీజేపీ నాయకత్వం దృష్టికి రాని అంశాలు, పార్టీపరంగా లోటుపాట్లు, ఇతర అంశాలను వివిధ విభాగాలు ప్రస్తావించినట్టు సమాచారం. ఆరెస్సెస్, పరివార సంస్థలు, అనుబంధ విభాగాల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా పక్కా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే ధ్యేయంగా పూర్తిస్థాయిలో కృషి చేయాలని సూచించినట్లు సమాచారం.

ఆరెస్సెస్‌ జాతీయ సర్‌ కార్యవాహ (జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ) ముకుంద్‌ ఈ మేరకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. కాగా తొలుత వీహేచ్‌పీ, భజరంగ్‌దళ్, బీఎంఎస్, ఏబీవీపీ, స్వదేశీ జాగరణ్‌ మంచ్, వనవాసి కళ్యాణ్‌ ఇతర క్షేత్రాల సమన్వయ సమావేశం జరిగింది. ఆ తర్వాత ఆదివారం రాత్రి దాకా ఆరెస్సెస్‌ ముఖ్యులు, సంఘ్‌పరివార్‌ అనుబంధ విభాగాల ముఖ్యులతో విడివిడిగా జరిగిన సమావేశాల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్‌చుగ్, సునీల్‌ బన్సల్, సహ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) శివప్రకాష్, జాతీయ కార్యదర్శి, రాష్ట్రపార్టీ సహ ఇన్‌చార్జి అర్వింద్‌ మీనన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి పి.మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ ప్రయత్నాలు గట్టిగా ఎదుర్కోవాలి
విశ్వసనీయ సమాచారం మేరకు.. ‘కేవలం మైనారిటీ వర్గ సంతుష్టీకర విధానాలతోనే మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నందున, అలాంటి వాటిని గట్టిగా ఎదుర్కోవాలి. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా బలహీనపడినందున దానికి ఎట్టిపరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు. వామపక్షాల ముఖ్యనేతలు అనుసరిస్తున్న స్వార్థ రాజకీయాలతో ప్రజలు ఆ పార్టీలను నమ్మే పరిస్థితి లేదు. అందువల్ల వాటికి మద్దతు తెలిపే కార్యకర్తలు, వర్గాలను కూడా అనుకూలంగా మలుచుకోవాలి. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీలో సమన్వయ లోపం వల్లనే ఓటమి చవిచూడాల్సి వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా పరివార్‌ అనుబంధ సంస్థలు తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషించాలి..’అని సమావేశం సూచించింది.  

మరిన్ని వార్తలు