బీజేపీలో.. పదవుల ముసలం..!

7 Oct, 2020 11:14 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో అంతంత మాత్రంగా ప్రభావం ఉన్న బీజేపీని ఆ పార్టీలోని వర్గపోరు మరింత బలహీనం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కనీసం మూడు వర్గాలుగా విడిపోయిన జిల్లా బీజేపీలో పదవుల కోసం లొల్లి మొదలైందని అంటున్నారు. ము న్సిపల్‌ ఎన్నికల వరకు అంతా కలిసికట్టుగా ఉన్నట్టు కనిపించిన బీజేపీలో ఆ తర్వాత పరిణామాలతో అభిప్రాయభేదా లు ఏర్పడ్డాయి. జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన కంకణా ల శ్రీధర్‌రెడ్డి ఏకపక్షంగా జిల్లా కార్యవర్గాన్ని నియమించుకున్నారన్న అసంతృప్తి గొడవలకు దారి తీస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. జిల్లా మాజీ అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, ప్రస్తుత అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి వర్గాలుగా జిల్లా  బీజేపీ విడిపోయిందన్న చర్చ జరుగుతోంది.

కొత్త అధ్యక్షుడిగా శ్రీధర్‌రెడ్డి నియామకం అయిన తర్వాత పార్టీ సమావేశాలు నిర్వహించడంలో, వివిధ కార్యక్రమాల నిర్వహణకు సీనియర్లను ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సీనియర్‌ నాయకులతో పాటు ద్వితీయ శ్రేణి కార్యకర్తలు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రానికి వచ్చే సందర్భంలో సీనియర్లకు కనీస సమాచారం లేకుండా కొందరిని కోటరిగా పెట్టుకుని వారు చెప్పినట్లుగా నడచుకుంటున్నారనే అపవాదును ఎదుర్కొంటున్నారు. అందరినీ కలుపుకొనిపోయి పార్టీని బలోపేతం చేయకుండా తమకు నచ్చని వారిని పక్కన పెట్టేసి, పార్టీని బలహీన పర్చేలా జిల్లా అధ్యక్షుడే వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇక, జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలు, ప్రజా సమస్యలపై ఎలాంటి ఆందోళనలు, పో రాటాలు చేయకుండా కేవలం ప్రెస్‌మీట్‌లతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల ముందు వివాదం..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అంతా కలిసి పనిచేయాల్సిన పార్టీ నాయకత్వం అభిప్రాయభేదాలతో ఎవరికి వారు అన్నట్లు వ్యవహరిస్తుండడం, ఆందోళన కలిగిస్తోందని బీజేపీ తటస్థ శ్రేణులు పేర్కొంటున్నాయి. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ సారి నల్లగొండ– ఖమ్మం– వరంగల్‌ ఎమ్మెల్సీ స్థానంపై పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ సంస్థాగత గ్రూపుల లొల్లి విజయావకాశాలను ప్రశ్నార్థకం చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పే పార్టీ నాయకత్వం మూడు గ్రూపులుగా విడిపోయి అంతర్గత పోరుతో రచ్చకెక్కడం పార్టీ శ్రేణులను కలవరానికి గురి చేస్తోంది. ఇటీవల జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు సన్నాహక సమావేశంలో జిల్లా అధ్యక్షుడు తప్ప ఇతర సీనియర్‌ నాయకులు ఒక్కరు కూడా పాల్గొనకపోవడం చూస్తుంటే అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోందని పార్టీ శ్రేణులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. జిల్లా అధ్యక్షుడు వ్యవహరిస్తున్న తీరుతో తాము సమావేశాలకు, ఇతర కార్యక్రమాలకు గైర్హాజరవుతున్నా ఏ మాత్రం మార్పు రావడంలేదని నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. 

రాష్ట్ర అధ్యక్షుడి వద్దకు పంచాయితీ !
గతంలో ఎన్నడూ లేనివిధంగా అంతర్గత పోరు రచ్చకెక్కుతుండడంతో తటస్థ కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై పోరాడాల్సిన పార్టీ జిల్లా నాయకత్వం గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు అపనమ్మకంతో వ్యవహరిస్తున్నరన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మాజీ జిల్లా అధ్యక్షుడి ఇంటికి వెళ్లి లాబీయింగ్‌ చేస్తున్నావా అంటూ ఏకంగా జిల్లా అధ్యక్షుడు జిల్లా కేంద్రానికి చెందిన ఓ నాయకుడితో మాట్లాడిన మాటల ఆడియో పార్టీ నేతలను ఒకింత ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆడియోలో ఇరువురి మధ్య  మాటల, తూటాలు పేలాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా అధ్యక్షుడి ఏకపక్ష నిర్ణయాలపై అసమ్మతి నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ముందే తేల్చుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర అధ్యక్షుడు ఈనెల 8వ తేదీన హైదరాబాద్‌కు వస్తున్నారని, ఆయన రాగానే జిల్లా పార్టీలో జరిగిన ఏకపక్ష నిర్ణయాలు, అధ్యక్షుడి తీరును వివరించేందుకు వ్యతిరేకవర్గం సిద్ధమవుతోందని చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు