సర్పంచ్‌ల సమస్యలపై కమలం పోరు

5 Jun, 2022 03:47 IST|Sakshi

గ్రామస్థాయిలో పటిష్టానికి బీజేపీ వ్యూహం

లంగర్‌హౌస్‌ బాపూఘాట్‌ వద్ద సంజయ్‌ మౌనదీక్షకు ఏర్పాట్లు

సాక్షి, హైదరాబాద్‌: గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టం చేసి రాజకీయంగా బలపడేందుకు బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని అనేకమంది సర్పంచ్‌లు విధులు, నిధులు, అధికారాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం, బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడటం పార్టీకి బాగా కలిసొస్తుందనే అంచనాకు వచ్చింది. కొంతకాలంగా బిల్లులు రాకపోవడం వల్ల సర్పంచ్‌లు మొదలు వివిధస్థాయిల ప్రజాప్రతినిధులు సమస్యలు ఎదుర్కొంటున్నట్టు మీడియాలో వార్తలు వస్తుండటంతో ఈ దిశలో కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది.

రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన నేపథ్యంలో గ్రామస్థాయిలో అధికార టీఆర్‌ఎస్‌ తీరును ఎండగట్టేందుకు ఇదే సరైన సమయమని నిర్థారణకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌ల సమస్యలపై పోరాటం చేయడం ద్వారా స్థానికసంస్థల్లో సర్కార్‌పై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవచ్చని భావిస్తోంది. స్థానిక సంస్థలపై వివిధ రూపాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆధిపత్య ధోరణిని ఎండగట్టి గ్రామస్థాయి నుంచి పట్టు సాధించాలని నిర్ణయించింది. 

త్వరలో గవర్నర్‌కు వినతిపత్రం 
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని సర్పంచ్‌ల సమస్యలను త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో పార్టీ నేతలు, పలువురు సర్పంచ్‌లతో కలసి గవర్నర్‌ డా. తమిళిసై సౌందరరాజన్‌కు వినతిపత్రం సమర్పించాలని రాష్ట్రపార్టీ నిర్ణయించింది. రాష్ట్రస్థాయిలో గవర్నర్‌ దృష్టికి సమస్యలను తీసుకెళ్లడంతోపాటు దీనికి కొనసాగింపుగా అన్ని జిల్లాల్లోని కలెక్టర్లకు సర్పంచ్‌లతో కలసి బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇతరముఖ్యనేతలు మెమోరాండం సమర్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల రెండోవారంలోగా సర్పంచ్‌ల సమస్యలపై లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌ వద్ద సర్పంచ్‌లతో కలసి సంజయ్‌ రెండుగంటల మౌనదీక్ష చేపట్టేలా కార్యక్రమం రూపొందిస్తున్నారు. దీనికి కొనసాగింపుగా రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహణ కోసం సర్పంచ్‌లు, పార్టీనేతలతో కమిటీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు