అధికారమే లక్ష్యంగా పనిచేస్తాం: డీకే అరుణ 

3 Oct, 2020 10:42 IST|Sakshi

సాక్షి, నారాయణపేట: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు రంగంలోకి దిగి ఓటరు నమోదుపై దృష్టి సారించాయి. నాయకులు, కార్యకర్తలతో ముఖ్యనేతలు సమావేశాలు నిర్వహించి ఓటరు నమోదు, ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. 

పట్టభద్రులపై గురి 
వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఓటరు నమోదు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. దీంతో జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడెక్కడ ఎంతమంది పట్టభద్రులు ఉన్నారో నాయకులు జల్లెడపడుతున్నారు. నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి అర్హులందరూ ఓటరు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. 

అధికార పార్టీ వ్యూహం  
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ దిశా నిర్ధేశంతో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే మక్తల్‌లో ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులు, యువకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. నారాయణపేట, కొడంగల్‌ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి సైతం ఈ ఎన్నికల్లో ఎలాగైనా తమ పార్టీ అభ్యర్థులకు ఎక్కువ సంఖ్యలో ఓటు వేయించేలా పార్టీల్లోని పట్టభద్రులైన యువతతో కార్యాచరణ రూపొందిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. 

సవాల్‌గా తీసుకున్న బీజేపీ 
ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ సవాల్‌గా తీసుకుంటుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే నారాయణపేట ప్రాంతంలో ఆ పార్టీకి పట్టుంది. ప్రస్తుత ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు ఈ ప్రాంతంలోనే అధికంగా ఓట్లు
పడ్డాయనేది బీజేపీ వాదన. ఈసారి సైతం బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు ఆ పార్టీ రాష్ట్ర నేతలు నాగూరావునామాజీ, రతంగ్‌పాండురెడ్డి కృషి చేస్తున్నారు. ఈ మేరకు బీజేపీలోని పట్టభద్రులైన కార్యకర్తలను సమీకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఓటర్లను ఆకట్టుకునే దిశగా ప్రణాళికలను రూపొందించే పనిలో పడ్డారు. మాజీ మంత్రి డీకే అరుణ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించటంతో బలం చేకూరిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

కదలిన కాంగ్రెస్‌ 
డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ యువ నాయకులు పట్టభద్రుల ఓటర్లకు గాలంవేసే పనిలో పడ్డారు. ఇటీవల ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. 

అధికారమే లక్ష్యంగా పనిచేస్తాం 

  • బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ 

దేవరకద్ర: రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. శుక్రవారం దేవరకద్రలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నేరవేర్చని దుస్థితిలో ఉందని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు రాష్ట్రాన్ని అప్పుల కూపంలో పడేశారని, రూ.మూడు లక్షల కోట్లు అప్పు తెచ్చి రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్రం ప్రభుత్వానివేనని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకుల ఆర్భాటం ఎక్కువైందని, ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైపల్యాలపై ప్రజలకు వివరిస్తామన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు డోకూర్‌ పవన్‌కుమార్, అంజన్‌కుమార్‌రెడ్డి, నంబిరాజు, రాచాలరాజు, నారాయణరెడ్డి, యజ్ఞభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా