‘ఎమ్మెల్సీ’ ఎన్నికలు.. బీజేపీ పోటాపోటీ!

6 Oct, 2020 10:26 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకులు ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, సీనియర్‌ నేత రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన మనోహర్‌ రెడ్డి పార్టీకి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. సీనియర్‌ నేత పేరాల శేఖర్‌రావు కూడా పెద్ద ఎత్తున లాబీయింగ్‌ చేస్తున్నట్లు ప్రచారం. కాగా ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్న సీనియర్లు  టికెట్‌ కోసం ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు కేడర్‌లో చర్చ నడుస్తోంది. 

వరంగల్‌ స్థానంపై గెలుపు ఆశలు..
వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానంపైనా బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయి. బీజేపీ తరఫున పోటీ చేసిన ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు రెండో స్థానంలో నిలిచారు. గట్టిపోటీనిచ్చి తొలి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకుండా టీఆర్‌ఎస్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఏడాదిగా వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు సీని యర్‌ నేతలు బీజేపీలో చేరారు. రాజ్యసభ సభ్యుడైన గరికపాటి రామ్మోహన్‌రావు కూడా ఉండటం ప్లస్‌ పాయింట్‌ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వంటి సీనియర్‌ నేతల బలం ఉండటంతో గెలుపుపై భారీ ఆశలే పెట్టుకుంది. అందుకే ఈసారి ఇక్కడి నుంచి పోటీకి బీజేపీలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఇనుగాల పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పేరాల శేఖర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. 

అభ్యర్థుల ఎంపికపై వడపోత..
త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలపై కమలం గురి పెట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ సీటుతో పాటు వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానంలో గెలుపు కోసం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌ సిట్టింగ్‌ సీటును తిరిగి గెలుచుకోవడంతో పాటు వరంగల్‌ ఎమ్మెల్సీ సీటునూ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మె ల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పేర్లను పార్టీ నాయకత్వం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పెద్దిరెడ్డి రెండు పర్యాయాలు కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం, కార్మిక సంఘాలకు రాష్ట్రస్థాయిలో ప్రాతినిధ్యం వహించారు.

వరంగల్‌లో విదాసంస్థలున్న పెద్దిరెడ్డికి రాజకీయంగా మంచి పేరుంది. ఇక టీడీపీలో కీలకంగా వ్యవహరించిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఎమ్మెల్యేగా, ఆ పార్టీ జాతీయ వ్య వహరాల్లో పాల్గొని బీజేపీలో చేరారు. ఈయనకు సుధీర్ఘ రాజకీయ అనుభ వం, పరిచయాలు ఉన్నాయి. బీజీపీలో వివిధ కేడర్‌లలో పనిచేస్తూ ఎదిగిన సీనియర్లు గుజ్జు ల ప్రేమెందర్‌రెడ్డి, పేరాల శేఖర్‌రా వు, నల్గొండకు చెందిన మనోహర్‌రెడ్డి కూడా టికెట్‌ కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. పోటా పోటీ ప్రయత్నాల్లో ఎవరికీ అవకాశం దక్కుతుందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు