రాజ్యసభకు బీజేపీ నుంచి ఒకరికి చాన్స్‌?

24 May, 2022 02:11 IST|Sakshi

యూపీ నుంచి ప్రాతినిధ్యం కల్పించే యోచనలో బీజేపీ 

నల్లు ఇంద్రసేనారెడ్డి, లక్ష్మణ్, మురళీధర్‌రావు, విజయశాంతి, వివేక్‌ పేర్లు పరిశీలన 

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో బీజేపీ నుంచి ప్రాతినిధ్యం కరువైన తెలంగాణ నుంచి పార్టీ సీనియర్‌ ఒకరిని పెద్దల సభకు పంపే దిశగా అధినాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ విస్తరణే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ, రాజ్యసభలో ఒకరికి ప్రాతినిధ్యం కల్పించి రాష్ట్రానికి తామిస్తున్న ప్రాధాన్యతను చాటే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఆ పార్టీ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని తమిళనాడు, కేరళ బీజేపీ నేతలకు ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పంపింది. తమిళనాడు బీజేపీ నేత ఎల్‌.మురుగన్‌ను మధ్యప్రదేశ్‌ నుంచి, కేరళకు చెందిన మురళీధర్‌ను మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు పంపడంతో పాటు వీరిద్దరిని కేంద్రమంత్రులను చేసింది.

కేరళ నుంచి సినీనటుడు సురేశ్‌ గోపిని రాష్ట్రపతి కోటాలో నామినేట్‌ చేసి రాజ్యసభకు పంపింది. ఇదే తరహాలో తెలంగాణ నేత ఒకరిని ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు పంపే ఆలోచనలు చేస్తోంది. బీజేపీ సీనియర్‌ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, మురళీధర్‌రావు, కె.లక్ష్మణ్, మాజీ ఎంపీలు విజయశాంతి, వివేక్, జితేందర్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. వీరితో పాటే మరో ఒకట్రెండు పేర్లు పరిశీలనలో ఉన్నా సామాజిక సమీకరణలు, సీనియారిటీ, పార్టీకి చేసిన సేవలను అంచనా వేసుకొనే అభ్యర్థిని నిర్ణయించనున్నారని తెలుస్తోంది. ఈ నెలాఖరుతో రాజ్యసభ నామినేషన్‌ గడువు ముగియనుంది. దీంతో రెండు, మూడు రోజుల్లోనే దీనిపై బీజేపీ అధిష్టానం నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలున్నట్లు సమాచారం.   

మరిన్ని వార్తలు