వారం రోజుల పాటు కమలం ‘హంగామా’!

16 Jun, 2022 01:00 IST|Sakshi

మోదీ సభకు ముందే రెడీ

జాతీయ కార్యవర్గ భేటీలు, బహిరంగ సభ నేపథ్యంలో బీజేపీ దూకుడు

ఈ నెల 28 నుంచి జిల్లాల్లో పర్యటనలకు కార్యాచరణ

కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలతో కార్యక్రమాలు

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనన్నది ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం

3న జరిగే మోదీ సభకు భారీ జన సమీకరణపై దృష్టి

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలతో దూకుడుగా ముందుకెళ్లాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. వచ్చేనెల 2 నుంచి నాలుగో తేదీ వరకు సమావేశాలు జరగనుండగా.. అంతకు నాలుగు రోజుల ముందు నుంచే కార్యకర్తలు, అభిమానులు, ప్రజల్లో జోష్‌ పెంచేలా వివిధ కార్యక్రమాలు చేపట్టనుంది.

మొత్తంగా ఈ నెల 28 నుంచి వచ్చేనెల 4 దాకా (వారం పాటు) జిల్లాల్లో పర్యటనలు, కార్యవర్గ భేటీ, బహిరంగసభకు సంబంధించిన ప్రచారం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. క్షేత్రస్థాయి వరకు పార్టీ కార్యకర్తలు, ప్రజల దృష్టిని ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. తెలంగాణకు బీజేపీ అగ్రనాయకత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ.. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయశక్తి బీజేపీనేని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది.

ఈ క్రమంలోనే వచ్చే నెల 3న ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని.. దానికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ కేడర్‌ను, వివిధ వర్గాల ప్రజలను సమీకరించాలని నిర్ణయించింది. ప్రధానంగా బూత్‌ కమిటీల నుంచీ కార్యకర్తలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలను ఆదేశించింది. 

అనుకూల వాతావరణంపై ప్రచారం! 
తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడిందని చాటాలని.. జాతీయ కార్యవర్గ భేటీకి చేస్తున్న ఏర్పాట్లను ఇందుకు ఉపయోగించుకుని, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.

కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఉంటే.. అన్నివర్గాల వారి సమస్యలు పరిష్కారమవుతాయని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతాయనే భరోసాను ప్రజలకు కల్పించాలని నేతలకు సూచించింది. ఈ క్రమంలోనే జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో పార్టీకి అనుకూల వాతావరణం కల్పించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

28 నుంచే ఫుల్‌జోష్‌! 
రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి వచ్చే నెల 1 దాకా (4 రోజులు) పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముఖ్యనేతలు, పలు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు తెలంగాణవ్యాప్తంగా పర్యటించేలా బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రాంతాల వారీగా గ్రూపులు చేసి.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో 3, 4 రోజులు పర్యటించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

ఈ సందర్భంగా కేంద్రం అమలుచేస్తున్న పథకాలు, తమ రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వివరించనున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలే అమలుకు నోచుకోకపోవడం వంటి అంశాలను ఎత్తిచూపేలా ప్రచారం చేయనున్నారు.

2వ తేదీ నుంచి మొదలయ్యే కార్యవర్గ సమావేశాలు, 3న పరేడ్‌ గ్రౌండ్స్‌లో మోదీ, అమిత్‌షాల సభ విజయవంతానికి ఈ పర్యటనలు దోహదపడతాయని నేతలు అంచనా వేస్తున్నారు. ఇక జాతీయ భేటీ, బహిరంగ సభ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ఈనెల 28న అన్ని జిల్లాల్లో పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు.   

మరిన్ని వార్తలు