గద్దె దించుతామని ఫామ్‌హౌజ్‌లో ఉంటాడు.. 2024లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటైనా వస్తుందా?

29 Nov, 2022 17:08 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకునే యత్నం చేస్తున్నారని, ప్రజాస్వామ్య పరిరక్షణకు అవసరమైతే జైలుకు వెళ్తాం అని ప్రకటించారు బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.  భైంసా సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.  

పోలీసులను ఈ ప్రభుత్వం తమ ఏజెంట్లుగా పని చేయించుకుంటోందని, పోలీసుల తీరు పిల్లి కళ్లు మూసుకున్నట్లు ఉందని, కానీ, ప్రజలు ఇది కళ్లు తెరిచి చూస్తున్నారన్నారు కిషన్‌రెడ్డి. మాట్లాడితే బీజేపీని ఓడిస్తాం, ప్రధాని మోదీని గద్దె దించుతామని స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని, తీరా టైంకి ఫామ్‌హౌజ్‌లో ఉంటున్నారని ఎద్దేవా చేశారాయన. వెయ్యి మంది కేసీఆర్‌లు, ఒవైసీలు, వెయ్యి బీఆర్‌ఎస్‌లు, ఎంఐఎంలు వచ్చినా మోదీని అడ్డుకోలేరని అన్నారు. బీజేపీని బీఆర్‌ఎస్‌ అడ్డుకుంటుందా? 2024లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటైనా వస్తుందా? అని ప్రశ్నించారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు కిషన్‌రెడ్డి.   

తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ప్రతీ అవినీతి కుంభకోణం మీద దర్యాప్తు చేయిస్తామని, ప్రతీ పైసా వెనక్కి తెప్పించి ప్రజలకు పంచుతామని ప్రకటించారు కిషన్‌రెడ్డి. సంక్షేమం అంటున్న సీఎం కేసీఆర్‌ తెలంగాణలో.. ఆయుష్మాన్‌ భారత్‌ ఎందుకు అమలు చేయడం లేదని, దళితులను సీఎం చేస్తామన్న హామీ ఎందుకు నెరవేర్చలేదని, మూడు ఎకరాల భూమి ఎందుకు ఇవ్వడం లేదని, గిరిజనులకు  రిజర్వేషన్లు అమలు చేయడం లేదని, ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేయలేదని, సైనిక్‌స్కూల్‌ ఎందుకు రానివ్వడం లేదని నిలదీశారు. 

ప్రతీది కల్వకుంట్ల కుటుంబం చేతిలో ఉందని విమర్శించిన కిషన్‌రెడ్డి.. దళిత బంధుకి కారణం హుజురాబాద్‌ ఉపఎన్నిక, ఈటల రాజేందర్‌ అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు