టీఆర్‌ఎస్, బీజేపీ పరస్పర దాడులు

31 Dec, 2020 08:58 IST|Sakshi

 ఫ్లెక్సీల తొలగింపుతో మొదలైన వివాదం

 బీజేపీ నాయకుల అరెస్ట్‌

గొల్లపల్లి(ధర్మపురి): మండల కేంద్రంలో బుధవారం టీఆర్‌ఎస్, బీజేపీ నాయకుల పరస్పర దాడులతో ఉద్రిక్తత నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలోని వాసవిమాత ఆలయ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పాల్గొనాల్సి ఉండగా, కార్యక్రమం రద్దయ్యింది. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలపై స్పష్టతనిచ్చేలా ఇటీవల గొల్లపల్లిలో బీజేపీ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా, మూడురోజులకు పంచాయతీ అధికారులు తొలగించారు. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ నాయకుల ఫ్లెక్సీలు తొలగించలేదు. తమ ఫ్లెక్సీలను మంత్రి ప్రోద్బలంతోనే తొలగించారంటూ బీజేపీ నాయకులు, టీఆర్‌ఎస్‌ నాయకుల ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో వారి మధ్య సోషల్‌మీడియాలో మాటల యుద్ధానికి దారితీసింది. బుధవారం గొల్లపల్లిలో మంత్రి కార్యక్రమాన్ని అడ్డుకుంటామని బీజేపీ నాయకుల వాట్సాప్‌ గ్రూప్‌లో హెచ్చరించారు. దీంతో పోలీసులు ముందస్తుగా బీజేపీ మండల అధ్యక్షుడు కట్ట మహేశ్, దాదాపు 20 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కన్నం అంజయ్య, కార్యకర్తలతో వాసవిమాత ఆలయం ఆవిష్కరణ జరిగే చోటుకు వచ్చి టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ నాయకులు సైతం బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఒక్కసారిగా ఇరువర్గాలు భౌతికదాడులకు దిగాయి. జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ, ధర్మపురి సీఐ రాంచందర్‌రావు పోలీస్‌ సిబ్బందితో అక్కడికి చేరుకొని బీజే పీ నాయకులను అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనతో మంత్రి కార్యక్రమం రద్దయింది. స్టేషన్‌లో ఉన్న బీజేపీ నాయకులను మా జీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. టీఆర్‌ఎస్‌ నాయకలను సైతం అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశారు.ఠాణాలోనే గుజ్జుల రామకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడుతుండగా కొందరు బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను గోడపై నుంచి ఠాణాలోకి విసిరేశారు. దీంతో స్టేషన్‌ ఆవరణలో ఉన్న బీజేపీ కార్యకర్తలు దిష్టిబొమ్మను దహనం చేసి, నినాదాలు చేయగా పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఎస్పీ సింధూశర్మకు సమాచారం అందడంతో హుటాహుటిన రంగంలోకి దిగారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్‌చార్జి కన్నం అంజయ్య, మండలాధ్యక్షుడు కట్ట మహేశ్‌తో చర్చించారు.  

మరిన్ని వార్తలు