తెలంగాణలో కమల వికాసం ఎలా ఉంది?.. అమిత్‌ షాకు నేరుగా రిపోర్ట్‌లు

19 Oct, 2022 01:22 IST|Sakshi

బీజేపీ జాతీయ నాయకత్వానికి ‘స్వతంత్ర’ నివేదికలు...

అంతా బాగుంది, అధికారమే తరువాయి... అన్న ధోరణిలో.. రాష్ట్రనేతలు..

బీ అలర్ట్‌  అంటున్న అధిష్టానం

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర పార్టీ చేస్తున్న కృషి, సన్నద్ధతపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుతం తెలంగాణలో వాస్తవ పరిస్థితులేంటీ అన్న దానిపై క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు రహస్య నివేదికలు తెప్పించుకుంటోంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు నేరుగా నివేదికలు పంపేలా ఎలక్షన్స్‌ ప్రొఫెషనల్స్‌ బృందం ‘అసోసియేషన్‌ ఆఫ్‌ బిలియన్‌ మైండ్స్‌’ గత ఏడాదికి పైగా ఇక్కడి నుంచే పనిచేస్తోంది.

పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల ద్వారా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా ఇక్కడి నుంచి విడిగా రిపోర్ట్‌లు పంపే ఏర్పాటు ఉంది. వీటితో పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ పనితీరుపై పార్టీతో సంబంధం లేని స్వతంత్ర పరిశోధన, అధ్యయన సంస్థల ద్వారా జాతీయ నాయకత్వానికి ‘క్షేత్ర నివేదిక’లు అందుతున్నాయి. రాష్ట్ర పార్టీలో వివిధ స్థాయిల నాయకుల పనితీరు, నిర్వహిస్తున్న కార్యకలాపాలు, పార్టీ కార్యక్రమాలు, ప్రజల్లోకి ప్రభావం చూపేలా పార్టీ ప్రచారం వెళుతోందా..? లేదా అన్న అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది.

పార్టీలో సోషల్‌ ఇంజనీరింగ్‌ ఎలా జరుగుతోంది, సాధారణ కార్యకర్త మొదలు రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలు, జాతీయ కార్యవర్గ సభ్యుల వరకు వారికి అప్పగించిన బాధ్యతలు సరిగా నిర్వహిస్తున్నారా లేదా వారి పనితీరు ఎలా ఉంది? రాష్ట్ర పార్టీ పదాధికారులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు ఎలా పని చేస్తున్నారన్న అంశాలపై ఫోకస్‌ పెట్టింది. ఈ సంస్థల అధ్యయనం, పరిశీలనలతో సిద్ధం చేసిన తటస్థ రిపోర్ట్‌ల ఆధారంగా తెలంగాణలో భవిష్యత్‌ కార్యాచరణను అధినాయకత్వం సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలకు సంకేతాలు అందాయి.

పార్టీ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ఎక్కువగా..
అంతా బాగుంది అధికారంలోకి రావడమే తరువాయన్న ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్‌ తో రాష్ట్ర నాయకులు అలసత్వం ప్రదర్శించకుండా ఉండేలా జాతీయ నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. పార్టీలో కొత్త– పాత నేతలు, సీనియర్‌– జూనియర్‌ల మధ్య సమన్వయ లోపాలు, కొందరు ముఖ్య నేతలతోపాటు ఇతర స్థాయిల నాయకులు వ్యవహారశైలిని మార్చుకోవా లనే సూచనలు చేసినట్టు సమాచారం. రాష్ట్ర ముఖ్యనేతల్లో అధిక శాతం వ్యక్తిగత ప్రతిష్టతో పాటు సొంతంగా ప్రమోట్‌ చేసుకునేందుకే ఎక్కువగా ప్రాధాన్యత నివ్వడం, పార్టీ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ఎక్కువగా మొగ్గుచూపుతు న్నట్టు జాతీయ నాయక త్వానికి అందిన నివేదికల్లో స్పష్టమైంది.

రాష్ట్ర పార్టీలోని వివిధ స్థాయిల నాయకులు, కార్యకర్తలు ఒక సంఘటిత, ఉమ్మడి శక్తిగా కాకుండా ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్రంలో పార్టీ ఆశించిన ప్రయోజనాలు పూర్తి స్థాయిలో సాధించలేదని ఈ రిపోర్ట్‌ల్లో వెల్లడైనట్టు ముఖ్య నేతలు చెబు తున్నారు. ఈ నివేదికల ఆధారంగా కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మొద లుకుని జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యర్శులు, రాష్ట్ర పదాధికా రులు, జిల్లా అధ్యక్షులు, కార్యవర్గాలు, ఇలా యావత్‌ పార్టీకి నూత న దిశానిర్దే శనం సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన స్పష్టమైన కార్యా చరణను రాష్ట్ర పార్టీకి నాయకత్వం ఇవ్వ బోతున్నట్టు ‘సాక్షి’కి ఓ ముఖ్యనేత వెల్లడించారు. 

మరిన్ని వార్తలు