ప్రీతి ఘటనపై న్యాయ విచారణ జరపాలి.. ఆమెకు నిమ్స్‌లో సరైన వైద్యం అందట్లేదు!

26 Feb, 2023 16:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  నిమ్స్‌లో పీజీ డాక్టర్‌ ప్రీతికి సరైన వైద్యం అందడం లేదని  ఆరోపించారు బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. అంతేకాదు ప్రీతి ఘటనపై న్యాయ విచారణ జరపాలని తెలంగాణ సర్కార్‌ను డిమాండ్‌ చేశారాయన. ఆదివారం నిమ్స్‌కు వెళ్లిన ఆయన.. ప్రీతి తల్లిదండ్రుల్ని పరామర్శించి, ఆమె ఆరోగ్యస్థితిపై వైద్యులను ఆరా తీశారు. 

ఈటల కామెంట్స్‌..  మెడికల్‌ యూజీ.. పీజీ కాలేజీల్లో ర్యాగింగ్‌ జరుగుతూనే ఉంది. రాష్ట్రంలో సరిపడా వైద్యులు లేరు.. భారమంతా పీజీ విద్యార్థులపైనే పడుతోంది. ప్రీతి ఘటనను ఈ ప్రభుత్వం సీరియస్‌గా భావించాలి. గిరిజన విద్యార్థిని అయిన ప్రీతిపై.. సీనియర్ పీజీ విద్యార్థి సైఫ్ వేధించాడు. ఆ కారణంగా ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. హెచ్‌వోడీ, ప్రిన్సిపాల్, పేరెంట్స్ సహా అందరికీ సైఫ్ వేధింపుల గురించి ప్రీతి చెప్పింది. అంటే.. వైద్య కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్‌ వేధింపులు ఉన్నాయనే విషయం స్పష్టమవుతోంది. 

పైఅధికారులు ప్రీతి హారస్మెంట్ గురించి చెప్పినపుడు స్పందించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. మరోవైపు పోలీసులు కూడా పట్టించుకోలేదు. ప్రీతి ఇష్యూ పై సమగ్ర విచారణ జరపాలి. ఆమెకు ఇంకా మెరుగైన వైద్యం అందించాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి అని ఎమ్మెల్యే ఈటల.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు