కేసీఆర్‌ ఊరికి రూ.5 కోట్లిచ్చిన కేంద్రం

30 Jul, 2022 11:41 IST|Sakshi

వరంగల్ (ఖానాపురం) : కేంద్ర ప్రభుత్వం కేసీఆర్‌ స్వగ్రామం చింతమడకకు ఇప్పటివరకు రూ.5కోట్లు కేటాయిస్తే.. కేవలం రూ.కోటిన్నర మాత్రమే కేసీఆర్‌ ప్రభుత్వం ఖర్చు చేసిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. మండల వ్యాప్తంగా చేపట్టిన ప్రజా గోస–బీజేపీ భరోసా కార్యక్రమాన్ని శుక్రవారం బుధరావుపేట గ్రామంలో ప్రారంభించారు. తొలుత వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రఘునందన్‌రావు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తన గ్రామానికి కేంద్రం ఎక్కువ నిధులు కేటాయించినట్లు తెలుసుకున్న కేసీఆర్‌ పరువు కాపాడుకునేందుకు ఇంటింటికి రూ.10లక్షలు ఇచ్చాడన్నారు.

 ఆడపిల్లల ఆత్మాభిమానాన్ని కాపాడటానికి కేంద్రం స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని తీసుకొచి్చందని, ఇందులో మరుగుదొడ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రూ.9వేలు కేటాయించగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేలు మాత్రమే కేటాయించిందన్నారు. 2014, జూన్‌ 2 నుంచి  రాష్ట్రంలోని గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఎంత మేర నిధులు ఖర్చు చేసిందో సమాచార హక్కు చట్టం ద్వారా యువకులు దరఖాస్తు చేసి తెలుసుకోవచ్చన్నారు. 1978లో ఇందిరాగాంధీ గరీబీ హఠావో అనే నినాదాన్ని చెప్పగా.. కాంగ్రెస్‌ పెద్దలకు ఎలా అర్థమైందోగానీ గరీబీ హఠావో అంటే గరీబోళ్లను గ్రామాల అవతల పెట్టారన్నారు.

కేసీఆర్‌ పాలనలో సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడడం బాధాకరమన్నారు. అభివృద్ధిపై చర్చించడానికి చర్చలు, డిబేట్లకు సిద్ధమని ఆయన కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో సొమ్ము కేంద్రానిది అయితే.. సోకు కేసీఆర్‌ది అని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నియోజకవర్గ నాయకుడు గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, మండల పార్టీ నాయకులు రాజుయాదవ్, జల్లి మధు, యాకస్వామి, సలీం తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఖానాపురంలో వీఆర్‌ఏలు చేపట్టిన సమ్మెకు రఘునందన్‌రావు సంఘీభావం తెలిపారు. పలు గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే రఘునందన్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు. 

మరిన్ని వార్తలు