స్థానికులకు ఉద్యోగాలివ్వాలి 

26 Mar, 2021 02:25 IST|Sakshi

చట్టం తేవాలని ఎమ్మెల్యే రఘునందన్‌రావు విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: పరిశ్రమల్లో స్థానికులకు నిర్ధారిత మొత్తంలో ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం తేవాలని దుబ్బాక శాసనసభ్యుడు రఘునందన్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. స్థానికంగా పరిశ్రమలున్నప్పటికీ స్థానిక నిరుద్యోగులకు ఉపయోగం లేకుండా వేరే ప్రాంతాల వారికి ఉద్యోగాలు ఇస్తున్నారని, ఈ తీరు మారాలని గురువారం ఆయన శాసనసభలో పేర్కొన్నారు. పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడారు. 

కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా ఇదే డిమాండ్‌ చేశారు. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోకి వచ్చే చేగుంట ప్రాంతంలో 62 పరిశ్రమలున్నాయని, కానీ వాటిల్లో ఏ వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయో కూడా తెలియనీయకుండా వ్యవహరిస్తున్నారని, కనీసం ఆ పరిశ్రమలకు బోర్డులు కూడా లేవని రఘునందన్‌రావు తెలిపారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులకు కనీస వేతనాలు కూడా ఇవ్వట్లేదని, ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే స్థానికులు కానందున వారి తరఫున మాట్లాడే వారూ లేకుండా పోతున్నారన్నారు.

ఇక్కడ పరిశ్రమలు ఎక్కువగా ఉంటున్నందున స్థానికంగా ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, కార్మిక సంక్షేమ నిధి నుంచి ఓ విద్యాలయం, కార్మికుల కోసం ఫంక్షన్‌ హాల్‌ ఏర్పాటు చేయాలని కోరారు.

నా ఇలాఖాలో సింగిల్‌ రోడ్డు..కేటీఆర్‌ ఇలాఖాలో డబుల్‌ రోడ్డా..
ముస్తాబాద్‌ నుంచి దుబ్బాక మండల కేంద్రానికి ఉన్న రోడ్డు విషయంలో వివక్ష ఉందన్న భావన కలుగుతోందని రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఈ రోడ్డు తన ఇలాఖాలో సింగిల్‌ రోడ్డుగా ఉండగా పొరుగునే ఉండే కేటీఆర్‌ నియోజకవర్గం పరిధిలో డబుల్‌ రోడ్డుగా ఉందని సభ దృష్టికి తెచ్చారు. వెంటనే తన పరిధిలోనూ డబుల్‌ రోడ్డు చేయాలని కోరారు.

దౌల్తాబాద్‌–చేగుంట రోడ్డును కూడా రెండు వరుసలకు విస్తరించాలన్నారు. చేగుంట మండలంలోని 8 పంచాయతీల పరిధిలో రిజర్వ్‌ ఫారెస్టు భూమిని సాగుచేస్తున్నారంటూ రైతులకు కొత్త పాస్‌ పుస్తకాలు ఇవ్వట్లేదని రఘునందన్‌రావు సభలో ఫిర్యాదు చేశారు. 

>
మరిన్ని వార్తలు