రాజాసింగ్‌ వ్యాఖ్యల ఎఫెక్ట్‌: పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం.. భారీగా పోలీసుల మోహరింపు

24 Aug, 2022 07:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌, ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిన దుమారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా.. రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది బీజేపీ. మరోవైపు రాజాసింగ్‌ వ్యాఖ్యలపై పాతబస్తీలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. నాటకీయ పరిణామాల తర్వాత మంగళవారం రాత్రి రాజాసింగ్‌కు బెయిల్‌ దక్కిన నేపథ్యంలో.. భారీగా యువత ఓల్డ్‌సిటీలో రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో  ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పాతబస్తీలో రోడ్లపైకి చేరిన స్థానిక యువత రాజాసింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది. చార్మినార్‌ వద్ద పెద్ద సంఖ్యలో యువకులు గుమిగూడారు.  శాలిబండ చౌరస్తాలో రాజాసింగ్‌ దిష్టిబొమ్మను దహనం చేసి.. ఆయన్ని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మొఘల్‌పురాలో పోలీస్‌ వాహనాన్ని ధ్వంసం చేయడంతో.. హైటెన్షన్‌ నెలకొంది. పోలీసులు నిరసనకారుల్ని చెదరగొట్టారు. అయితే చివరకు పోలీస్‌ అధికారులు నిరసనకారులతో మాట్లాడి.. పంపించేశారు.

ఈ నేపథ్యంలో ఈ ఉదయం(బుధవారం) మరోసారి చార్మినార్‌ పరిసర ప్రాంతంలో యువత గుమిగూడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో  పాతబస్తీ నుంచి గోషామహల్‌కు వెళ్లే రోడ్లు మూసేసి.. భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. బేగంబజార్‌లోని ఛత్రి బ్రిడ్జి దగ్గర వాతావరణం ఒక్కసారిగా మారింది. రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేయాలంటూ నిరసనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన నడుమ.. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదీ చదవండి: ఫీనిక్స్‌ సంస్థపై ఐటీ దాడుల్లోనూ కేసీఆర్‌ కుటుంబమే లక్ష్యం?!

>
మరిన్ని వార్తలు