టీఆర్‌ఎస్, ఎంఐఎం నేతలకు అడ్డూఅదుపు లేదు: రాజాసింగ్‌

6 Jun, 2022 04:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ పాలనలో టీఆర్‌ఎస్, మజ్లిస్‌ నాయకులకు అడ్డు అదుపు లేకుండా పోయిందని బీజేఎల్పీ నేత టి.రాజాసింగ్‌ మండిపడ్డారు. తాము ఏం చేసినా చెల్లుతుందనే భావనతో అధికారిక వాహనాలను అడ్డాగా చేసుకుని, హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచార ఘటనకు ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

మే 28న ఘటన జరిగితే, ఇంతవరకు వారిని అరెస్టు చేయకపోవడం, పూర్తి స్థాయిలో విచారణ జరపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. టీఆర్‌ఎస్, మజ్లిస్‌ పారీ్టలకు చెందిన ఎమ్మెల్యే, వక్ఫ్‌బోర్డ్‌ ఛైర్మన్, ప్రముఖుల కుమారులు ఈ కేసులో ఉన్నట్లు సీసీ టీవీ పుటేజీలు, వీడియోల్లో స్పష్టంగా కన్పిస్తున్నా ఇంకా చర్యలు తీసుకోకపోవడమేమిటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించి నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు.   

మరిన్ని వార్తలు