సీఎం కేసీఆర్‌ను నిలదీసిన  బీజేపీ నేత లక్ష్మణ్‌ 

20 Sep, 2022 04:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ ఆమోదం, అనుమతితోనే రాష్ట్రంలో ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) అమలవుతున్నాయా అని సీఎం కేసీఆర్‌ను బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డా.కె.లక్ష్మణ్‌ ప్రశ్నించారు. ఎనిమిదేళ్లపాటు నిద్రమత్తులో జోగిన కేసీఆర్‌ తాను పెంచే 10 శాతం ఎస్టీల రిజర్వేషన్లను ప్రధాని మోదీ ఆమోదిస్తారా అని మాట్లాడటంలో అర్థమే లేదన్నారు. దేశంలో ఇంతగా ప్రజలను మోసగించి దిగజారిన రాజకీయాలు చేసే సీఎం మరొకరు లేరని మండిపడ్డారు. సోమవారం లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వమే జీవోతో రిజర్వేషన్లను పెంచుకునే అవకాశమున్నా కేంద్రాన్ని బద్నామ్‌ చేస్తోందన్నారు.

వెంటనే ఈ రిజర్వేషన్ల పెంపుపై జీవో తెచ్చి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. గత 8 ఏళ్లలో ఎస్టీ రిజర్వేషన్లు పెంచకపోవడం వల్ల విద్య, ఉద్యోగాల్లో నష్టపోయిన గిరిపుత్రుల సంగతేంటని నిలదీశారు. కుటుంబ ప్రయోజనాల కోసం పాకులాడే రాహుల్, కేసీఆర్‌ కుటుంబాలు మోదీ లక్ష్యంగా విషప్రచారం సాగిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రం, బీజేపీపై విమర్శల్లో రాహుల్‌ను కేసీఆర్‌.. రేవంత్‌రెడ్డిని కేటీఆర్‌ అనుసరిస్తున్నారన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు కేసీఆర్‌ తాయిలాలు ప్రకటిస్తున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మునుగోడులో లబ్ధి కోసం గిరిజనబంధు తెచ్చే ఆలోచన చేస్తున్నారని చెప్పారు. మరో ఉపఎన్నిక వస్తే బీసీ బంధు తెస్తారేమోనని వ్యాఖ్యానించారు. ఏదెలా ఉన్నా టీఆర్‌ఎస్‌ దుకాణాన్ని ప్రజలు బంద్‌ చేయడం ఖాయమన్నారు. 

మరిన్ని వార్తలు