యూపీ నుంచి నామినేషన్‌ వేయనున్న బీజేపీ నేత

30 May, 2022 23:41 IST|Sakshi

సాధారణ కార్యకర్తలకు గుర్తింపు ఇది: కె.లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నేత, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు ఆ పార్టీ రాజ్యసభ చాన్స్‌ ఇచ్చింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం, సీనియర్లకు సముచిత గౌరవం ఇవ్వడం లక్ష్యంగా పార్టీ అధిష్టానం లక్ష్మణ్‌కు ఈ అవకాశం ఇచ్చినట్టుగా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. యూపీ నుంచి లక్ష్మణ్‌ను రాజ్యసభకు పంపనున్నారు. ఈ మేరకు నామినేషన్‌ వేసేందుకు ఆయన మంగళవారం యూపీలోని లక్నోకు వెళ్లనున్నారు. తనకు రాజ్యసభ అవకాశం కల్పించడం పట్ల కె.లక్ష్మణ్‌ సంతోషం వ్యక్తంచేశారు. ‘‘సాధారణ కార్యకర్తకు లభించిన గౌరవం, గుర్తింపు ఇది. బీజేపీ తప్ప మరే పార్టీలోనూ ఇది సాధ్యం కాదు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాలకు కృతజ్ఞతలు’’ అని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

ఏబీవీపీ నుంచి మొదలై..
1956 జూలై 3న హైదరాబాద్‌లో జన్మించిన లక్ష్మణ్‌.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ చేశారు. ఆయనకు భార్య ఉమ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బీసీ–మున్నురుకాపు çవర్గానికి చెందిన లక్ష్మణ్‌ ఓయూలో చదువుతున్నపుడే అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ)లో పనిచేశారు. 1980లో బీజేపీలో చేరారు. 1995–1999 మధ్య పార్టీ హైదరాబాద్‌ నగరశాఖకు అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా ఎదిగారు. 2016–2020 మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలోనే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది.

రెండుసార్లు ఎమ్మెల్యేగా..
1994లో ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కోదండరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 1999లో అదే నియోజకవర్గం నుంచి గెలిచారు. తర్వాత 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2020 సెప్టెంబర్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడిగా నియమితులయ్యారు. తెలంగాణ నుంచి బీజేపీ తరఫున మొదటిసారిగా రాజ్యసభకు వెళ్తున్నది లక్ష్మణే కావడం గమనార్హం.  

మరిన్ని వార్తలు