టార్గెట్‌ కాంగ్రెస్‌! చేవెళ్లతో మొదలై మునుగోడు మీదుగా.. నెక్ట్స్‌?

1 Aug, 2022 01:07 IST|Sakshi

దక్షిణ తెలంగాణపై కమలం పార్టీ దృష్టి 

ఆయా జిల్లాల్లో కాంగ్రెస్‌ బలంగా ఉందని భావిస్తున్న బీజేపీ 

కాంగ్రెస్‌ నేతలను చేర్చుకునే దిశగా మంతనాలు 

కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తర్వాత రాజగోపాల్‌రెడ్డి! 

ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ నేతలు లేరంటూ సునీల్‌ కనుగోలు నివేదిక! 

కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్న టీఆర్‌ఎస్‌ నేతలపైనా బీజేపీ నజర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ టార్గెట్‌గా బీజేపీ పావులు కదుపుతోంది. ఆ పార్టీ నేతలను తమవైపు తిప్పుకునేందుకు తెరవెనుక మంతనాలు సాగిస్తోంది. చేవెళ్లతో మొదలు పెట్టిన చేరికల గేమ్‌.. ఇప్పుడు మునుగోడు మీదుగా ఎక్కడివరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి ఉందని కాంగ్రెస్‌ వర్గాలంటున్నాయి.

ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా దక్షిణాదిలో బలంగా కనిపిస్తోన్న కాంగ్రెస్‌ను దెబ్బకొట్టి, తన విజయావకాశాలు మెరుగు పరుచుకునేలా బీజేపీ అడుగులు వేస్తోందని సీనియర్‌ నేతలు అంటున్నారు. మరోపక్క ఈ వలస వ్యవహారం జోరందుకుంటే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ నేతలు లేరని, ఇది పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని పార్టీ పొలిటికల్‌ కన్సల్టెంట్‌ సునీల్‌ కనుగోలు అధిష్టానానికి నివేదించినట్టు తెలుస్తోంది.  

కొండాతో షురూ.. 
టీఆర్‌ఎస్‌ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలిచి 2019లో ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ కండువా వేసుకున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పరేడ్‌ గ్రౌండ్స్‌లో  ఇటీవల జరిగిన సభలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. విశ్వే­శ్వ­ర్‌రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత చేవెళ్ల పార్లమెంట్‌ స్థానానికి ఇన్‌చార్జిగా పెట్టేందుకు ఆ స్థాయి ఉన్న నేత ఎవరూ లేకపోవడం ఆందోళనకర­మని అధిష్టానానికి నివేదిక వెళ్లినట్టు తెలిసింది. 20­19లో కాంగ్రెస్‌ తరఫున చేవెళ్ల ఎంపీగా పోటీచేసిన విశ్వే­శ్వర్‌రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. 

రాజగోపాల్‌రెడ్డికి రెడ్‌కార్పెట్‌! 
ఇక మునుగోడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రస్తుతం నియోజకవర్గ ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ పేరుతో తిరుగుతున్నారు. కోమటిరెడ్డి కుటుంబం ఎప్పట్నుంచో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆయన పార్టీని వీడితే రెండు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో ప్రభావం ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్‌ నేతలే చెబుతున్నారు.

గతంలో భువనగిరి ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన రాజగోపాల్‌రెడ్డి తన పరిచయాలతో నల్లగొండతో పాటు ఖమ్మంలోనూ ప్రభావం చూపిస్తారని బీజేపీ బలంగా విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో అవసరమైతే ఆయనతో మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండల్లో పాదయాత్ర చేయించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇది తొలుత కాంగ్రెస్‌ పార్టీపైనే ప్రభావం చూపిస్తుందని సీనియర్‌ నేతలు అంటున్నారు. రాజగోపాల్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని కొంతమంది నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చినా సునీల్‌ కనుగోలు వద్దని వారించినట్టు తెలిసింది.  

మహబూబ్‌నగర్, ఖమ్మంపైనా దృష్టి 
టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు భావిస్తున్న కొంతమంది నేతల పైనా బీజేపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఈటల రాజేందర్‌ చర్చిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి కృష్ణారావు కాంగ్రెస్‌లోకి వెళ్లాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేరికతో పాటు, ఈటల రాజేందర్‌కు బీజేపీలో లభిస్తున్న ప్రాధాన్యత, రాజగోపాల్‌రెడ్డి అదే పార్టీలో చేరబోతున్నారనే వార్తలతో ఆయన సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది.

ఇక ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటితోనూ గతంలో ఈటల ఒకసారి సమావేశమైనట్టు వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతానికి ఆయన కుమార్తె వివాహ వేడుకలో బిజీగా ఉన్నారని తెలిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని నూతన జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేత సైతం బీజేపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిసింది.  

ప్రత్యామ్నాయం లేకపోతే ప్రమాదం 
కాంగ్రెస్‌లో సీనియర్‌/ప్రముఖ నేతలున్న చోట ప్రత్యామ్నాయ నేతలు లేకపోవడం ఇప్పుడు ఆ పార్టీకి గడ్డు పరిస్థితిని తెచ్చిపెట్టేలా ఉంది. రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారి ఉప ఎన్నికలు వస్తే దీటుగా ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ నేతలు లేరనే దానిపై సునీల్‌ కనుగోలు టీం ఇప్పటికే నివేదిక సిద్ధం చేసినట్టు తెలిసింది. అక్కడ టికెట్‌ ఆశిస్తున్న వారిలో బలమైన నేతలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ నేతలపై దృష్టి సారించినట్టు తెలిసింది. ఇలా నల్లగొండలోని నకిరేకల్, ఆలేరు, దేవరకొండ, మిర్యాలగూడ స్థానాల్లో నేతల కొరత కనిపిస్తున్నట్టు తెలిసింది.

ఇక మహబూబ్‌నగర్‌లోని మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానంతో పాటు జడ్చర్ల, గద్వాల, మక్తల్, దేవరకద్ర, షాద్‌నగర్‌ నియోజకవర్గాల్లో బలమైన నేతలు లేకుండానే నెట్టుకొస్తున్నట్టు సునీల్‌ టీం నివేదించినట్టు తెలిసింది. ఈ పరిస్థితి పార్టీకి ప్రమాదకరమని, బలమైన నేతలను పార్టీలోకి తీసుకురావడంతో పాటు ఉన్న నేతలపై ఫోకస్‌ చేసి పార్టీ కిందిస్థాయి దాకా వెళ్లేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సునీల్‌ సూచించినట్టు తెలిసింది.   

మరిన్ని వార్తలు