ఇన్‌చార్జులుగా బయటి నేతలు

23 Jun, 2022 01:28 IST|Sakshi

అసెంబ్లీ ఎన్నికల కోసం కమలం ప్రణాళిక 

జాబితాలో కేంద్ర సహాయమంత్రులు, ఎంపీలు, ముఖ్య నేతలు 

నేడో, రేపో ప్రకటన? 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ జాతీయ నాయకత్వం కీలక ప్రణాళికను సిద్ధం చేసింది. 119 అసెంబ్లీ స్థానాలకు ఇతర రాష్ట్రాల ముఖ్యనేతలను ఇన్‌చార్జులుగా నియమించనుంది. ఏడాది, ఏడాదిన్నరలోగా అసెంబ్లీ ఎన్నికలు లేని రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులను, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే ఆలోచన లేని వారిని ఇందుకోసం ఎంపిక చేయనుంది.

కేంద్ర సహాయ మంత్రులు మొదలుకుని పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు, ఎంపీ లు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఆయా రాష్ట్ర పార్టీల ముఖ్య నేతలు, పదాధికారులను నియమించనున్నారు. గెలిచే అవకాశాలున్న స్థానాల్లో మంత్రులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలను ఇన్‌చార్జ్‌లుగా పెట్టనున్నారు. 119 నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌ల పేర్లను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నట్టు సమాచారం.  

జాతీయ భేటీకి ముందే..
ఇన్‌చార్జ్‌లు ఈ నెల 28న నగరానికి చేరుకుంటారు. జాతీయ కార్యవర్గ భేటీకి ముందు నాలుగురోజులు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత నెలకు ఒకసారి ఆయా స్థానాల్లో పర్యటించడం ద్వారా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసేదాకా పార్టీ బలోపేతంపై దృష్టి కేంద్రీకరిస్తారు.

మరోవైపు  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిలేని రాష్ట్ర పార్టీ నాయకులను కూడా నియోజకవర్గాల సమన్వయకర్తలుగా ఇటీవల నియమించారు. అయితే వారిలో కొందరు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి మొగ్గుచూపుతున్నట్టు తెలియడంతో వచ్చే రెండు నెలల్లో పార్టీ బూత్‌ కమిటీల నియామకం పూర్తయ్యాక వారి స్థానంలో కొత్త కోఆర్డినేటర్లను నియమించనున్నట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు