‘విజయ సంకల్పసభ’గా మోదీ బహిరంగ సభ! 

29 Jun, 2022 01:52 IST|Sakshi

నోవాటెల్‌లోనే ప్రధాని బస? 

రేపు సంతోష్‌జీ, 1న నడ్డా రాక 

సాక్షి, హైదరాబాద్‌: జూలై 3న సాయంత్రం పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరగనున్న ప్రధాని మోదీ బహిరంగసభకు ‘విజయసంకల్ప సభ’గా నామకరణం చేసినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 2న మధ్యాహ్నం 2, 3 గంటల ప్రాంతంలో ప్రత్యేక విమానంలో మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నోవాటెల్‌–హెచ్‌ఐసీసీలోని జాతీయ కార్యవర్గ సమావేశ ప్రాంగణానికి చేరుకుంటారు.

భద్రతా కారణాల దృష్ట్యా మోదీ నోవాటెల్‌లో బసచేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. అయితే నోవాటెల్‌తో పాటు వెస్టిన్‌ హోటల్, మరోచోట ఇంకా రాజ్‌భవన్‌లోనూ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని రెండురోజుల పాటు నగరంలోనే విడిది చేస్తున్న సందర్భంగా చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం లేదా హైదరాబాద్‌లోని ఏదైనా ఒక ప్రదేశాన్ని ఆకస్మికంగా సందర్శించే (సర్‌ప్రైజ్‌ విజిట్‌’) అవకాశాన్ని కొట్టిపడేయలేమని పార్టీ నాయకులు తెలిపారు. 

1న సమావేశాల ఎజెండా ఖరారు 
జూలై 1–4 తేదీల మధ్య జరిగే భేటీ నిమిత్తం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా 1న మధ్యాహ్నమే హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన తర్వాత నోవాటెల్‌లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల భేటీలో పాల్గొని జాతీయ సమావేశాల ఎజెండా ఖరారు చేస్తారు. కాగా సమావేశాలు, మోదీ సభకు ఏర్పాట్ల తుది పరిశీలన నిమిత్తం పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌జీ గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. 

సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి 
జూలై 2,3 తేదీల్లో బీజేపీ జాతీయ సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధుల రిజిస్ట్రేషన్లు, బస, భోజనం, మీటింగ్‌ హాలు తదితర ఏర్పాట్లు పూర్తయ్యాయి. నోవాటెల్‌లో వివిధ కమిటీల ద్వారా చేసిన సన్నాహాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్, ఏర్పాట్ల స్టీరింగ్‌ కమిటీ చైర్మన్, ఎంపీ డా.కె.లక్ష్మణ్, బండి సంజయ్‌ తదితరులు మంగళవారం సమీక్షించారు. 3న మోదీ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ రూపొందించిన ‘హలో ఆదివాసి, గిరిజన –చలో హైదరాబాద్‌’పోస్టర్‌ను పార్టీకి చెందిన గిరిజన నేతలతో కలిసి సంజయ్‌ అవిష్కరించారు.  

నేటి నుంచి నియోజకవర్గాలకు.. 
జాతీయ కార్యవర్గసభ్యుల్లో 30 మంది దాకా బుధవారమే నగరానికి చేరుకుంటారు. వారంతా నేరుగా రాష్ట్రంలో తమకు అప్పగించిన నియోజకవర్గాలకు వెళతారు. పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు గురువారం తమకు కేటాయించిన నియోజకవర్గాలకు వెళతారు.   

మరిన్ని వార్తలు