కేసీఆర్‌ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిద్దాం: బీజేపీ

11 Sep, 2022 02:16 IST|Sakshi

అందుకోసం అంతా కలసి పనిచేయాలి 

పార్టీ శ్రేణులకు బీజేపీ నేత సునీల్‌ బన్సల్‌ పిలుపు 

క్లాసిక్‌ గార్డెన్‌లో ‘విమోచన’ సన్నాహక సమావేశం 

రసూల్‌పుర(హైదరాబాద్‌): సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో సెప్టెంబర్‌ 17న జరగనున్న హైదరాబాద్‌ విమోచన అమృత్‌ మహోత్సవాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్‌ క్లాసిక్‌ గార్డెన్‌లో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జీ సునీల్‌ బన్సల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం నుంచి 1948లో విముక్తి కలిగిందని కానీ కొత్త నిజాం కేసీఆర్‌ నుంచి విముక్తి కలి్పంచేందుకు అంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ విముక్తి దినోత్సవం గురించి ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని పార్టీ కార్యకర్తలకు ఆయన సూచించారు. సెప్టెంబర్‌ 17న ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని, అక్టోబర్‌ 2వరకు ఇవి కొనసాగుతాయని తెలిపారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామాల్లోని గడీలపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రజాకార్ల అకృత్యాలను తెలిపేలా పరేడ్‌ మైదానంలో ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 12న రంగోలి, 13న హైదరాబాద్‌ విమోచన చేయాలని పోరాడిన వారి విగ్రహాలకు అభిషేకం, 14న యువమోర్చా ఆ«ధ్వర్యంలో స్కూటర్‌ ర్యాలీ, 15న చార్మినార్‌ నుంచి మహిళా మోర్చా ర్యాలీ, 16న షోయాబుల్లా ఖాన్‌ విగ్రహానికి నివాళులు లాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 17న ప్రతి డివిజన్‌ నుంచి వంద మోటర్‌ సైకిళ్లతో పరేడ్‌ మైదానానికి రావాల్సిందిగా కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. 

తగ్గేదే లేదని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నాం.. 
ప్రధాని మోదీ, అమిత్‌ షా, నడ్డాలు తగ్గేదెలే అని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారని బీజేపీ నేత మురళీధర్‌రావు అన్నారు. సెపె్టంబర్‌ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కేసీఆర్‌.. ఎంఐఎం నేత అసదుద్దీన్‌ అనుమతి అడిగారన్నారు. అత్యంత క్రూరుడైన ఖాసీం రిజ్వీ వారసుల అనుమతి అడగడం హేయమైన చర్య అని ఆరోపించారు. గతంలో అసదుద్దీన్‌ జాతీయ జెండా పట్టుకునే వారు కాదని.. కానీ, ఇప్పుడు నమాజ్‌ చేస్తున్నప్పుడు కూడా జెండా పట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు డా.లక్ష్మణ్, రాంచందర్‌ రావు, వివేక్‌ వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ప్రజాప్రతినిధులను పశువుల్లా కొంటున్నారు.. సీఎం కేసీఆర్‌పై ఈటల ఆగ్రహం

మరిన్ని వార్తలు