బండి సంజయ్‌ పర్యటన ఉద్రిక్తం!

7 Jan, 2023 03:58 IST|Sakshi

కామారెడ్డిలో కలెక్టరేట్‌ ముట్టడికి సంజయ్‌ ప్రయత్నం 

పోలీసులు, బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట 

సంజయ్‌ను అరెస్ట్‌ చేసి కారులో ఎక్కించిన పోలీసులు 

అడ్డుకుని కారు అద్దాలు ధ్వంసం చేసిన కార్యకర్తలు 

పలువురు అదుపులోకి.. హైదరాబాద్‌కు సంజయ్‌ తరలింపు 

అంతకుముందు రైతు రాములు కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర చీఫ్‌ 

అధికార పార్టీ నేతలు, అధికారులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణ 

సాక్షి, కామారెడ్డి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కామారెడ్డి పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం రాత్రి సంజయ్‌ పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్‌ ముట్టడికి రాగా పోలీసులు అడ్డుకున్నారు. దీనితో తీవ్ర తోపులాట, వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకున్నాయి. తొలుత బండి సంజయ్‌ జిల్లాలోని అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు పయ్యావుల రాములు కుటుంబాన్ని పరామర్శించారు.

ప్రభుత్వ తీరును తప్పుపడుతూ.. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై తేల్చుకునేందుకు కలెక్టరేట్‌కు వెళతానని అక్కడే ప్రకటించారు. కాసేపటికే పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి జిల్లా కలెక్టరేట్‌కు బయలుదేరారు. ఈ విషయం తెలిసిన పోలీసులు కామారెడ్డి ప్రధాన రహదారిపై బారికేడ్లు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేసినా.. బీజేపీ శ్రేణులు బారికేడ్లను తోసివేసి, బండి సంజయ్‌ కాన్వాయ్‌ను ముందుకు తీసుకువెళ్లాయి.  

కలెక్టరేట్‌ ముందు ఘర్షణ 
కామారెడ్డి పట్టణంలో కలెక్టరేట్‌ ప్రధాన గేటుకు కొంత ముందు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి సంజయ్, బీజేపీ శ్రేణులను అడ్డుకున్నారు. కానీ వందల సంఖ్యలో చేరిన బీజేపీ కార్యకర్తలు బలంగా తోయడంతో బారికేడ్లు కింద పడిపోయాయి. బండి సంజయ్, ఇతర నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి చొచ్చుకువెళ్లే ప్రయత్నం చేశారు. ప్రధాన గేటును మూసి ఉండటంతో అది సాధ్యపడలేదు. కొందరు కార్యకర్తలు గేటు ఎక్కి లోపలికి దూకాలని చూడగా పోలీసులు అడ్డుకున్నారు. ఇలా దాదాపు గంట పాటు బీజేపీ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.

చివరికి పోలీసులు సంజయ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో ఎక్కించారు. కానీ పార్టీ శ్రేణులు పోలీసు వాహనం ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. కొందరు ఆ వాహనం అద్దాలన్నీ ధ్వంసం చేశారు. బానెట్‌పై, అన్ని వైపులా గట్టిగా బాదడంతో కారు దెబ్బతిన్నది. అయినా పోలీసులు బీజేపీ శ్రేణులను పక్కకు తప్పించి వాహనాన్ని ముందుకు తీసుకువెళ్లారు. బండి సంజయ్‌ను హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనలో మరో వాహనం కూడా దెబ్బతిన్నట్టు చెప్తున్నారు. కానీ అంతా చీకటిగా ఉండటంతో స్పష్టత రాలేదు. ఇక పోలీసులపై, వాహనంపై దాడి చేసిన వారిలో కొందరిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు